- తేమ సమస్య నుంచి బయటపడుతున్న టైమ్లో పరిస్థితి మళ్లీ మొదటికి
- తేమ తగ్గి పత్తి అమ్ముకుందామంటే ఇదేం గోస అంటూ రైతుల ఆవేదన
- 25 లక్షల టన్నుల్లో సీసీఐ కొన్నది 1.20 లక్షల టన్నులే..
- సీసీఐ, జిన్నింగ్ మిల్లులు, దళారుల కారణంగా నిండా మునుగుతున్న రైతులు
హైదరాబాద్, వెలుగు: వర్షాలతో పత్తిపంట దెబ్బతిని ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుపై మరో పిడుగుపడింది. పత్తి కొనుగోళ్లపై కేంద్రం తీరుకు నిరసనగా సోమవారం నుంచి జిన్నింగ్ మిల్లులు బంద్ ప్రకటించాయి. పత్తి కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అవలంబిస్తున్న కొత్త నిబంధనలపై జిన్నింగ్ మిల్లర్లు ఆందోళన చేపట్టాయి.
జిన్నింగ్ మిల్లులను ఎల్–1, ఎల్–2 కేటగిరీలలో అలాట్‌మెంట్, యాప్ రిజిస్ట్రేషన్, ఎకరానికి కేవలం 7 క్వింటాళ్లే కొంటామనే నిబంధనలు తీసుకువచ్చి పరేషాన్ చేస్తున్న సీసీఐ తీరుపై తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మండిపడుతున్నది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్టు అసోసియేషన్ ప్రకటించింది. ఎల్-1, ఎల్-2 కేటగిరీలను ఎత్తివేయాలని, యాప్ రిజిస్ట్రేషన్ వంటి ఇబ్బందికర నిబంధనలను సడలించాలని జిన్నింగ్ మిల్లుల సంఘం డిమాండ్ చేస్తున్నది.
మొంథా తుఫాన్, అకాల వర్షాలు లాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పత్తి రైతులు ఇప్పటికే బాగా నష్టపోగా, ఇప్పుడు కేంద్రం నిబంధనల పేరుతో జిన్నింగ్ మిల్లర్లను, రైతులను ఇబ్బందులకు గురిచేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్‌లో 45.85 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగైంది. కాగా, 27 లక్షల టన్నుల పత్తి పంట దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేస్తున్నది. కాగా, ఇప్పటి వరకు సీసీఐ రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్ల ద్వారా కేవలం 67వేల మంది రైతుల నుంచి 1.18 లక్షల టన్నుల పత్తి మాత్రమే కొనుగోలు చేసింది. తాజాగా వాతావరణం మారి పత్తి కొనుగోళ్లు ఊపందుకునే టైంలో మిల్లర్లు సమ్మే చేపట్టి పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తామని ప్రకటించడంతో రైతులకు ఇబ్బందిగా మారింది.
పరిస్థితి మళ్లీ మొదటికి
మొన్నటి వర్షాలకు పత్తి చేన్లు ఆగమై భారీగా రైతులు నష్టపోయారు. 1,51,707 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ ప్రాథమిక నివేదికలో తేల్చింది. వరంగల్, హన్మకొండ, జనగాం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, నల్గొండ, నాగర్కర్నూల్, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల్లో భారీగా పంట నష్టం జరిగినట్లు గుర్తించారు. అంతేగాకుండా వర్షాలతో పత్తి తడిసి తేమశాతం భారీగా పెరిగింది. ఇన్నాండ్లు వాతావరణం చల్లబడి ఉండడంతో 25శాతం వరకు తేమ ఉండేది. తాజాగా వానలు తగ్గ ఎండలు పెరుగుతున్న సందర్భంలో తేమ సమస్య నుంచి బయటపడుతున్న తరుణంలో కాటన్ అసోసియేషన్ బంద్ ప్రకటించడంతో రైతుల పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. తీరా పత్తి అమ్ముకుందా మనుకుంటున్న టైంలో మళ్లీ ఇదేం ఇబ్బందులంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోజుకో నిబంధనతో నిండా మునుగుతున్న పత్తి రైతులు
ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేస్తామని సీసీఐ ప్రకటించింది. గత సీజన్‌లో ఎకరాకు 12 క్వింటాళ్లు కొనుగోలు చేసి.. ఈసారి 5 క్వింటాళ్లు తగ్గించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా.. పత్తిలో తేమ 8 నుంచి 12 శాతం కంటే ఎక్కువ ఉంటే కొనమని సీసీఐ స్పష్టం చేయడం.. రైతులను మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. అలాగే, సీసీఐ కొత్తగా ప్రవేశపెట్టిన ‘కపాస్ కిసాన్ యాప్’ లో రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ తప్పనిసరి చేశారు. కానీ, గ్రామీణ రైతుల్లో చాలామందికి స్మార్ట్ ఫోన్లు లేవు.
అందువల్ల యాప్‌లో నమోదు చేయలేకపోతున్నారు. మరో వైపు కేంద్రం దిగుమతి సుంకాలు సడలించడంతో బహిరంగ మార్కెట్లో పత్తి ధర భారీగా పడిపోగా.. ఇప్పుడు సీసీఐ కొత్త నిబంధనలతో రైతులు పూర్తిగా చిక్కుముడిలో పడ్డారు. దీనికితోడు సీసీఐ నిబంధనలకు వ్యతిరేకంగా కాటన్ జిన్నింగ్ మిల్లులు బంద్ చేపట్టడంతో రైతులు మరింత నష్టపోతున్నారు. ఒకవైపు సీసీఐ అధికారుల నిర్ణయాలు, మరోవైపు జిన్నింగ్ మిల్లులు బంద్, దీనికితోడు బహిరంగ మార్కెట్లో దళారులు కలిసి పత్తి రైతులను నిండా ముంచుతున్నరు.
అన్ని మిల్లులు నడవాల్సిందే
జిన్నింగ్ మిల్లులన్ని నడవాల్సిందే. ఎల్–1, ఎల్–2 విధానాలు ఎత్తేయాలి. ఈ విధానాలు పూర్తిగా అన్యాయం. ఈ తీరు ఇలాగే కొనసాగితే జిన్నింగ్ పరిశ్రమ మూతపడే ప్రమాదం ఉంది. సమస్యల గురించి ఎన్నిసార్లు చెప్పినా, లెటర్లు రాసినా సీసీఐ పెడచెవిన పెట్టింది. అందుకే మిల్లులు బంద్ చేయక తప్పడం లేదు.
– బొమ్మినేని రవీందర్ రెడ్డి,
కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
