కుటుంబాల్లో అనోమీ, లోన్లీనెస్.. ప్రమాదకరంగా  మనుషుల ఆలోచనలు

కుటుంబాల్లో అనోమీ, లోన్లీనెస్.. ప్రమాదకరంగా  మనుషుల ఆలోచనలు

హైదరాబాద్ , చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటీవల ఆత్మహత్యలు ఆందోళనకరంగా మారుతున్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులు మొత్తం ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు మనసును కలచివేస్తున్నాయి. చిన్న పిల్లలను ఒంటరిగా వదిలేయలేని స్థితిలో దంపతులు పిల్లలను కలుపుకొని ప్రాణాలు వదులుతున్నారు. ఈ ఘటనలు ఆర్థిక ఒత్తిళ్లు, మానసిక కుంగుబాటు, సామాజిక తోడ్పాటు లోపాలను బయటపెడుతున్నాయి. ఈ దుర్ఘటనలు కేవలం వ్యక్తిగత సమస్యలగానే కాకుండా.. సమాజంలోని అసమానతలు, సామాజిక బంధాల బలహీనతలను ప్రతిబింబిస్తున్నాయి.

జనవరి 31న హైదరాబాద్​లో ఒక తల్లి , ఆమె ఇద్దరు పిల్లలు రైల్వే ట్రాక్​పై ఆత్మహత్య 
చేసుకున్నారు. పిల్లలిద్దరు ఇంటర్​ చదువుతున్నారు. కారణాలు స్పష్టంగా తెలియకపోయినా.. మానసిక ఒత్తిడి , కుటుంబ సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. ఇదొక్కటేకాదు, గత కొన్ని నెలల్లో ఇటువంటి ఘటనలు హైదరాబాద్ చుట్టుపక్కల చాలా వెలుగు చూశాయి. 

మెదక్ జిల్లాలో భర్త చనిపోయాడని ఒంటరితనంతో 2025 డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో 25 ఏళ్ల మహిళ తన రెండేళ్ల కుమారుడిని చంపి, తానూ ఆత్మహత్య చేసుకుంది. మరో ఘటన 2025 నవంబర్​లో జరిగింది. వికారాబాద్ జిల్లాలోని కుల్చర్ల లో ఒక వ్యక్తి తన భార్య, కుమార్తె , అత్తమామలతో సూసైడ్ చేసుకున్నాడు. కిందటి ఏడాది మార్చిలో హబ్సిగూడలో పదిహేనేండ్లు కూడా నిండని ఇద్దరి పిల్లలతో కలిసి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. 

ఎన్సీఆర్బీ డేటా ప్రకారం.. తెలంగాణలో 2022లోనే 9,980 ఆత్మహత్యలు నమోదయ్యాయి. ఇందులో కుటుంబ ఆర్థిక సమస్యలు ప్రధాన కారకాలు. 2025-– 2026లో ఈ సంఖ్య మరింత పెరుగుతాయని అంచనాలు ఉన్నాయి.

వార్తలే కాదివి.. 

ఈ ఘటనలు కేవలం వార్తలు మాత్రమే కాదు.. సమాజంలోని ఆర్థిక అసమానతలు, ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిళ్లు, మానసిక ఆరోగ్య సమస్యలకు ఈ సంఘటనలు అద్ధంపడుతున్నాయి. హైదరాబాద్ వంటి నగరాల్లో పెరుగుతున్న ఒంటరితనం, కుటుంబ బంధాల బలహీనత ఇటువంటి దుర్ఘటనలకు దారితీస్తున్నాయి. 

ఫ్రెంచ్ సామాజిక శాస్త్రవేత్త ఎమిల్ దుర్క్​హైమ్​ 1897లో తన ‘సూసైడ్’ గ్రంథంలో ఆత్మహత్యలను వ్యక్తిగత సమస్యలుగా కాకుండా సామాజిక పర్యవసనాలుగా విశ్లేషించాడు. సామాజిక సమైక్యత (సోషల్ ఇంటిగ్రేషన్) , నియంత్రణ (సోషల్ రెగ్యులేషన్) ఆధారంగా సూసైడ్‌‌‌‌‌‌‌‌లను నాలుగు రకాలుగా వర్గీకరించాడు.

  సమాజంతో బంధాలు బలహీనమైనప్పుడు ఒంటరితనం రావడం, ఎవరి నుంచీ సపోర్ట్ లేకపోవడం ‘ఈగోయిస్టిక్’ సూసైడ్‌‌‌‌‌‌‌‌కు దారితీస్తుంది. మెదక్ ఘటన ఈ రకమైన సూసైడ్‌‌‌‌‌‌‌‌కు ఉదాహరణ. ఆధునిక నగర జీవనంలో పెరుగుతున్న ఐసోలేషన్, బంధాల బలహీనతలు ఇలాంటి ఆత్మహత్యలకు దారితీస్తాయి. అలాగే, అనామిక్ సూసైడ్ అంటే ఆర్థిక సంక్షోభాలు, అప్పులు , ఉద్యోగాల ఒత్తిడి వంటివి. అదే మనిషిని ‘అనోమీ’ స్థితికి చేర్చుతాయి. 

 సామాజిక నిబంధనలు, విలువలు విచ్ఛిన్నమవడం, బంధాలు బలహీనపడటం వల్ల అనోమి ఆత్మహత్యలు జరుగుతాయి.  దీనివల్ల వ్యక్తులు సామాజిక నియమాల నుంచి దూరమైనట్లు భావిస్తారు. ఫలితంగా ఎలాంటి లక్ష్యం లేనివాళ్లలాగా, దిక్కుతోచని స్థితికి, గందరగోళానికి గురవుతారు. ఆధునిక సమాజంలో వేగవంతమైన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మార్పులు కూడా అనోమీకి ప్రధాన కారణాలు. 

ప్రపంచీకరణ, సాంకేతిక అభివృద్ధిలో ఇమడలేక పోవడం వల్ల కూడా వ్యక్తుల్లో అనిశ్చితి భావనలు పెరుగుతాయి. దీనికి ఆర్థిక అసమానతలు తోడై  అనోమీని తీవ్రతరం చేస్తాయి. ఇలా అనోమీ వ్యక్తిగతంగానూ, సామాజికంగానూ తీవ్ర ప్రభావాలను చూపుతుంది. ఇది వ్యక్తి స్థాయితో మొదలై ఆత్మహత్యకు దారితీసినా.. ఒక్కోసారి సమాజంలో అలజడులను తెచ్చిపెడుతుంది. అనోమీవల్ల వ్యక్తుల్లో చాలా సందర్భాల్లో సమాజవిద్రోహ ప్రవర్తన పెరుగుతుంది.  

మాదకద్రవ్యాలకు అలవాటుపడతారు,  నేరాలకు పాల్పడతారు. మరికొందరిలో అది మానసిక ఆరోగ్య సమస్యలను పెంచుతుంది.  క్రైమ్​ రేటు పెరుగుదలకు, సామాజిక అశాంతికి, సామాజిక విచ్ఛిన్నానికి కారణం అనోమి అవుతుంది. 

హబ్సిగూడ ఘటనలో ఆర్థిక ఇబ్బందులు ఈ రకం సూసైడ్‌‌‌‌‌‌‌‌ను సూచిస్తాయి. ఆర్థిక అసమానతలు, ఖర్చులు, ఉపాధి లోపం ఇటువంటి అనోమీని ప్రేరేపిస్తున్నాయి. ఈ ఘటనల్లో కొన్నిసార్లు ఆల్ట్రూయిస్టిక్ లక్షణాలు కూడా కనిపిస్తాయి. తల్లి ‘పిల్లలను ఒంటరిగా వదిలేయలేను’ అనే భావనతో పిల్లలను కూడా ఆత్మహత్యలో భాగం చేస్తుంది. ఇలా ప్రాణాలను త్యాగం చేయడం ఆల్ట్రూయిస్టిక్ సూసైడ్ లక్షణాలు.

సమాజంలోని సంక్షోభానికి ఇవి హెచ్చరికలు. హైదరాబాద్ వంటి నగరంలో ఉద్యోగాలున్నా , ఆదాయాలు పెరిగినా, మానసిక ఆరోగ్య సమస్యలు, ఒంటరితనం, ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం లోన్లీనెస్​కు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.  ఆత్మహత్యల్లో ప్రధానంగా అనామిక్ సూసైడ్, ఈగోయిస్టిక్ సూసైడ్ లక్షణాలు కనిపిస్తున్నాయి. దంపతులు ఐసోలేషన్, అనోమీలో ఉన్నప్పుడు దాని పరిధిలో లేని పిల్లలు కూడా తల్లిదండ్రుల ఆత్మహత్య నిర్ణయంలో భాగమై జీవితాన్ని త్యాగం చేయాల్సి రావడం బాధాకరం. 

సమాజం , ప్రభుత్వం బాధ్యతలు

ఆర్థిక వృద్ధి ఉన్నప్పటికీ మానసిక ఆరోగ్య సేవలు, కౌన్సెలింగ్ సెంటర్లు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరి మధ్య సామాజిక బంధాలు బలంగా పెరిగేందుకు  సమాజంలో ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి.  మెంటల్​ హెల్త్​ కేర్​ హెల్ప్‌‌‌‌‌‌‌‌లైన్లు , కమ్యూనిటీ సపోర్ట్ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌లను బలోపేతం చేయాలి. ఉదాహరణకు.. ఆత్మహత్య నివారణ కోసం ఎన్సీఆర్బీ సూచనలను అమలు చేయడం, స్కూల్స్ , వర్క్‌‌‌‌‌‌‌‌ప్లేస్‌‌‌‌‌‌‌‌లలో మెంటల్ హెల్త్ అవేర్‌‌‌‌‌‌‌‌నెస్ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌లు నిర్వహించడం ప్రభుత్వం చేయాల్సిన పని. దుర్క్​హైమ్​ చెప్పినట్లు.. ‘సమాజంలో బలమైన సంబంధాలే వ్యక్తుల జీవితాలను రక్షిస్తాయి. ఆ సత్సంబంధాలు బలహీనమైనప్పుడు వ్యక్తులు తమ జీవితాలను అర్థరహితం అని భావిస్తారు’. కుటుంబాల్లో జరుగుతున్న ఈ దుర్ఘటనలు ఆధునిక సమాజానికి, జీవనానికి హెచ్చరికలాగా ఉండాలి. ప్రభుత్వాలు సామాజిక సమైక్యతను పెంచే విధానాలు రూపొందించాలి. 

- వినోద్ మామిడాల, ఓయూ, సోషియాలజీ-