చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్ సోమవారం తమిళనాడు అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. సీఎం విజయ్ నేతృత్వంలో తమిళనాడు అసెంబ్లీ తొలి సమావేశం సోమవారం (మే 11, 2026) జరగనుంది.
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కూడా అసెంబ్లీలో సోమవారం జరుగుతుంది. మే 12న (మంగళవారం) తమిళనాడు అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. అయితే.. ముఖ్యమంత్రిగా విజయ్ అడుగుపెడుతున్న అసెంబ్లీలో స్టాలిన్ లేకపోవడం గమనార్హం.
కొలత్తూరు అసెంబ్లీ స్థానంలో పోటీ చేసిన స్టాలిన్ టీవీకే పార్టీ అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో ఓడిన సంగతి తెలిసిందే. 1989 నుంచి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన స్టాలిన్.. 2021లో సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 35 ఏండ్ల రాజకీయ జీవితంలో ఓడిపోవడం ఇదే తొలిసారి.
అయితే.. స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ మాత్రం ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రతిపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్ డీఎంకే గొంతుకగా మారనున్నారు. తండ్రి లేని అసెంబ్లీలో ప్రభుత్వ పనితీరుపై, ప్రజా సమస్యలపై గొంతెత్తాల్సిన బాధ్యత ఉదయనిధి స్టాలిన్ చేతుల్లోనే ఉంది.
సీఎం, డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ తన కంచుకోట అయిన కొళత్తూరు నియోజకవర్గంలో ఓటమి పాలవడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో 8 వేల 795 ఓట్ల తేడాతో పరాజయం చెందారు.
అన్నాడీఎంకే చీఫ్ ఈ పళనిస్వామి తన సొంత నియోజకవర్గమైన ఎడప్పాడిలో మరోసారి విజయం సాధించారు. టీవీకే మద్దతు ఉన్న స్వతంత్ర అభ్యర్థి ప్రేమకుమార్‌పై 98,110 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. టీవీకేపై డీఎంకే, అన్నాడీఎంకే అసెంబ్లీలో కొట్లాడనున్నాయి.
