- 334 సెంటర్లు ప్రపోజల్.. ఓపెన్ చేసినవి 115 మాత్రమే
- ఓ వైపు గన్నీ బ్యాగుల కొరత, మరో వైపు ట్రాన్స్‌పోర్ట్ లేటే..
- అకాల వర్షాలు.. సెంటర్లలో రైతుల అగచాట్లు
మంచిర్యాల/లక్సెట్టిపేట, వెలుగు: కష్టపడి పండించిన వడ్లను అమ్ముకోవడానికి రైతులు అవస్థలు పడుతున్నారు. మద్దతు ధర లభిస్తుందని తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే కొనుగోళ్లలో జాప్యంతో రోజుల తరబడి పడిగాపులు తప్పడం లేదు. వడ్లు కొనుగోలు కేంద్రాలకు తెచ్చి 20 రోజులైనా కాంటా పెట్టడం లేదని, కాంటా పూర్తయినా వారం దాకా లారీల కొరతతో మిల్లులకు తరలించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వడ్లు మిల్లులకు అన్‌లోడ్ అయ్యేదాకా రైతులదే బాధ్యత కావడంతో పగలు రాత్రి కాపలా కాయాల్సిన పరిస్థితి. మరోవైపు అకాల వర్షాలు రైతులను టెన్షన్ పెడుతున్నాయి. నాలుగు రోజుల కింద ఈదురుగాలులు, వర్షం రాగా.. కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న వడ్లను కాపాడుకునే ప్రయత్నంలో కొత్తూరు, గంపలపల్లిలో నలుగురు రైతులు మృత్యువాత పడ్డారు.
నత్తనడకన కొనుగోళ్లు..
మంచిర్యాల జిల్లాలో ఈ సీజన్ లో 2 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఇందుకోసం 334 సెంటర్లు ప్రతిపాదించగా, ఇప్పటివరకు 115 మాత్రమే ఓపెన్ చేశారు. బుధవారం వరకు కేవలం 15,881 మెట్రిక్ టన్నులు సేకరించారు. ఇందులో 8,956 టన్నులు రైస్ మిల్లులకు తరలించగా, మిగతా వడ్లు ఇంకా సెంటర్లోనే ఉన్నాయి. ట్రాన్స్‌పోర్టేషన్, ట్యాబ్ ఎంట్రీ ఆలస్యం వల్ల రైతులకు చెల్లింపులు డిలే అవుతున్నాయి. మొత్తం రూ.37.94 కోట్లకు గాను ఇప్పటివరకు రూ.1.42 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో జమయ్యాయి. మరోవైపు జిల్లాలో గన్నీ బ్యాగుల కొరత తీవ్రంగా ఉంది.
70.27 లక్షల సంచులు అవసరం కాగా 36.14 లక్షలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ 17 లక్షలు మాత్రమే సెంటర్లకు సప్లై చేశారు. ఇంకా 34.12 లక్షల బ్యాగులు రావాల్సి ఉంది. లక్సెట్టిపేట మున్సిపాలిటీతో పాటు మండలంలో 22 సెంటర్లు ఉన్నాయి. 17 ఐకేపీ సెంటర్లకు 1.60 లక్షల సంచులు అవసరమని ప్రతిపాదనలు పంపినా రాకపోవడంతో కొనుగోళ్లు లేట్ అవుతున్నాయి.
10 మిల్లులకు మాత్రమే ట్యాగింగ్
జిల్లాలోని మెజారిటీ రైస్ మిల్లులు సీఎంఆర్ పెండింగ్‌లో ఉండడంతో బ్లాక్ లిస్టులో పెట్టారు. ఈ సీజన్‌లో 10 మిల్లులకు మాత్రమే ట్యాగింగ్ ఇచ్చారు. సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు తరలించగా, మిగతావి గోదాముల్లో నిల్వ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 60 వేల మెట్రిక్ టన్నుల కెపాసిటీ గల గోదాములను గుర్తించారు. ఎట్టకేలకు సెంటర్ల వద్ద కాంటా చేసినప్పటికీ ట్రాన్స్ పోర్ట్ ఆలస్యం కారణంగా రైతులు వారం పది రోజుల వరకు కాపలా కాస్తూ ఇబ్బందులు పడుతున్నారు. కాగా రైతులు తెచ్చిన ధాన్యంపై కప్పుకోవడానికి టార్పాలిన్లు ప్రభుత్వం ఇవ్వకపోవడంతో వారికి అవి పెనుభారంగా మారాయి.
కొంతమంది రైతులు ప్లాస్టిక్ సంచులతో కుట్టించుకుని వాడుతుండగా, కొంతమంది రైతులు కవర్లు కొని కుప్పలపై కప్పుతున్నారు. కొనుగోలు సెంటర్లకు టార్పాలిన్లు ఐదు నుంచి 10 మాత్రమే ఇస్తున్నారు. వాటిని కాంటా చేసిన సంచులపై కప్పడానికే ఉపయోగిస్తున్నారు తప్ప రైతులకు ఇవ్వడం లేదు. ప్యాడీ క్లీనర్లు, ప్యాడీ తడయ్యర్లను అందుబాటులో ఉంచడంలో అధికారులు ఫెయిల్ కావడంతో రైతులు అవస్థలు పడుతున్నారు.
లేదంటూనే కటింగ్‌లు పెడుతున్నరు
ధాన్యం కొనుగోలులో తరుగు బెడద తప్పడం లేదు. ఒక్కో బస్తాకు సుమారు రెండు కేజీల నుంచి నాలుగు కేజీల వరకు తీస్తున్నట్లు సమాచారం. మంచిర్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు ఎలాంటి తరుగు తీయొద్దని చెప్పినప్పటికీ ఇంటర్ మిల్లర్లు వాటి సెంటర్ల నిర్వాహకులు ఎమ్మెల్యే ఆదేశాలను బేఖాతర్ చేస్తున్నారు.
20 రోజులైనా కాంటా కాలేదు..
కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చి 20 రోజులు అవుతోంది. ఇప్పటివరకు కొనలేదు.. కాంటా కూడా వేయలేదు. గన్నీ బ్యాగులు లేకపోవడం వల్లనే లేట్ అయితాంది.. సంచులు తొందరగా తెప్పించి కాంటా వేయాలి. - గడికొప్పుల రవీందర్, గంపలపల్లి
ఎవరూ పట్టించుకుంటలేరు..
నేను మూడున్నర ఎకరాలలో వరి వేసిన. ధాన్యాన్ని కేంద్రానికి తీసుకువచ్చి 20 రోజులైంది. ఇప్పటికీ కాంటా పెట్టలేదు. వడ్ల కుప్పల దగ్గర పడిగాపులు కాస్తున్నాం. మా గోసను ఎవరూ పట్టించుకుంటలేరు.
- పంచర్పుల రాజేశం, కొత్తూరు
