మదర్స్ డే రోజున ఘోరం: మతిస్థిమితం లేని తల్లిని.. పాడుబడ్డ ఇంట్లో వదిలేసిన కొడుకులు...

మదర్స్ డే రోజున ఘోరం: మతిస్థిమితం లేని తల్లిని.. పాడుబడ్డ ఇంట్లో వదిలేసిన కొడుకులు...

మదర్స్ డే రోజున ఘోరం జరిగింది... మతిస్థిమితం లేని వృద్ధురాలు అని కూడా చూడకుండా తల్లిని పాడుబడ్డ ఇంట్లో వదిలేసారు కొడుకులు. కానీ పెంచిన నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నా కూడా అనాధలా మారింది పాపం ఆ తల్లి. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో జరిగింది ఈ ఘటన. ఆదివారం ( మే 10 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... 

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన 90 ఏళ్ళ వడ్లకొండ రాజవ్వ అనే వృద్ధురాలు తన భర్త నారాయణతో కలిసి జీవించేది. వీరికి నలుగురు కుమారులు, ఇద్దరు కూతురు ఉన్నారు. వీరు కరీంనగర్, కోరుట్ల, బొంబాయి ప్రాంతాల్లో నివసిస్తున్నారు. భర్త నారాయణ కొన్నేళ్ల క్రితం చనిపోగా... రాజవ్వ ఒంటరి జీవితాన్ని గడుపుతుంది. 

లక్షల రూపాయల ఆస్తులు సంపాదించి కుమారులకు సమానంగా పంచింది రాజవ్వ. రెండు ఇండ్లు, స్థలాలు సంపాదించి అందరికీ సమానంగా పంచింది. అప్పటినుండి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి... ఆస్తులు స్వాధీనం చేసుకున్న కొడుకులు తల్లిని మాత్రం గత రెండేళ్లుగా వంతుల వారిగా సాకుతున్నారు. 

ఈ క్రమంలో ఆదివారం మదర్స్ డే రోజున ఓ కుమారుడు తన వంతు పూర్తయిందని తల్లిని కరీంనగర్ నుండి తీసుకువచ్చి కొడిమ్యాలలోని పాత ఇంట్లో వదిలేసి వెళ్లిపోయాడు. తినడానికి తిండి లేక మతిస్థిమితం కోల్పోయి ఆ తల్లి బిక్కుబిక్కుమంటుంది. ఇది గమనించిన స్థానికులు ఆహారం నీళ్లు అందించారు. లక్షల రూపాయల ఆస్తులు సంపాదించి నేడు తినడానికి తిండిని కోల్పోయిన ఆ తల్లిని చూసి స్థానికులు ఆ కసాయి కొడుకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజవ్వకు పూర్తిస్థాయిలో వైద్యం అందించి ఆమె బాగోబులు చూసేలా కొడుకులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు.