వెలుగు ఓపెన్ పేజీ..స్వేచ్ఛను రక్షించాల్సిన చోట.. హరిస్తే?

వెలుగు ఓపెన్ పేజీ..స్వేచ్ఛను రక్షించాల్సిన చోట.. హరిస్తే?

వ్యక్తి స్వేచ్ఛ అత్యంత  ప్రాముఖ్యమైనది.  ఇది రాజ్యాంగం ప్రసాదించిన హక్కు మాత్రమే కాదు,  భారత రాజ్యాంగానికి ఆత్మవంటిది.  వ్యక్తిగత స్వేచ్ఛని పరిరక్షించడమనేది న్యాయవ్యవస్థ  ప్రాథమిక బాధ్యత.  ఈ స్వేచ్ఛను సహేతుకంగా ఉండే  విధానాల ద్వారా పద్ధతుల ద్వారా జరగాలి.  అంతేకాని  స్వేచ్ఛను  హరించడమనేది  ఏకపక్షంలా శిక్షాత్మకంగా  ఉండటానికి వీల్లేదు.  స్వేచ్ఛను పరిరక్షించాల్సిన కోర్టులే.. స్వేచ్ఛను హరిస్తే ఎలా ఉంటుంది?  సరిగ్గా ఇదే ఆంధ్రప్రదేశ్​ హైకోర్టులో జరిగింది.  ‘తీసుకెళ్లండి..తీసుకెళ్లి లోపల వేయండి’ అని హైకోర్టు న్యాయమూర్తి న్యాయవాదిని చూపిస్తూ అనడం విస్మయానికి  గురిచేసింది.  

ఒక  వ్యక్తి స్వేచ్ఛను హరించాలంటే దానికి చట్టం కొన్ని పద్ధతులను,  పరిమితులను నిర్దేశించింది. దానికి మించి ప్రవర్తిస్తే అది అధికార దుర్వినియోగం అవుతుంది.   క్రిమినల్​ ప్రొసీజర్​ కోడ్​ స్థానంలో వచ్చిన  భారతీయ నాగరిక్ సురక్షా సంహిత 2023లో న్యాయపరిపాలనకు   సంబంధించిన నేరాలకి,  తప్పుడు సాక్ష్యం,  న్యాయానికి ఆటంకం కలిగించడం, కోర్టు ధిక్కారం వంటి నేరాలు కోర్టులో జరిగినప్పుడు  తక్షణ చర్యలు తీసుకోవడానికి న్యాయస్థానానికి అధికారం ఉంటుంది. 

భారతీయ నాగరిక్​ సురక్షా సంహితలోని 384 ప్రకారం సివిల్,  క్రిమినల్​ లేదా రెవెన్యూ  కోర్టుల సమక్షంలో జరిగే ధిక్కార కేసులని నిర్వహించే విధానాన్ని వివరిస్తుంది. కోర్టుని అవమానపరిచినా,  ధిక్కరించినా  ఈ  నిబంధన  ప్రకారం కోర్టులకు శిక్షించే అధికారం ఉంటుంది. హైకోర్టు  కూడా ఈ నిబంధన ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. ఆ నేరానికి పాల్పడిన వ్యక్తిని  అదుపులోకి  తీసుకుని,  అతనికి  షోకాజ్​  నోటీసు ఇచ్చి సహేతుకమైన అవకాశం ఇచ్చిన తరువాత శిక్ష విధించవచ్చు. ఈ శిక్ష రూ.1000 జరిమానా వరకు మాత్రమే విధించే అవకాశం ఉంది.  ఈ జరిమానా చెల్లించనిపక్షంలో  ఒక నెల రోజుల వరకు శిక్ష విధించే అవకాశం ఉంది. ఈ శిక్షకు వ్యతిరేకంగా కారణాలు చూపడానికి నేరస్తునికి సహేతుకమైన అవకాశం ఇవ్వాలి.  కోర్టు ధిక్కారణ చట్టం 1971, కోర్టు సమక్షంలో  ధిక్కారణ,  పరోక్ష  ధిక్కారణలకు వేర్వేరు విధానాలు ఉన్నాయి.  కోర్టు నోటీసు జారీ చేస్తుంది. ఆ నేరానికి పాల్పడిన  వ్యక్తి తన డిఫెన్సుని  రాతపూర్వకంగా  దాఖలు చేయాలి.   ఆ తరువాత అతని వాదనలు విని కోర్టు తన తీర్పుని  వెలువరిస్తుంది. 

ధిక్కార నేరాలు రెండు రకాలు

ధిక్కార నేరాలు రెండు రకాలుగా ఉంటాయి. అవి సివిల్, క్రిమినల్​ నేరాలు.  హైకోర్టు లేదా సుప్రీంకోర్టు తనకు తానుగా చర్యలు తీసుకోవచ్చు. అడ్వకేట్ జనరల్ ​ప్రతిపాదించినప్పుడు చర్యలు తీసుకోవచ్చు.  అటార్నీ  జనరల్​  అనుమతినిగానీ,  సొలిసిటర్​ జనరల్​నుంచి రాతపూర్వక అనుమతి తీసుకుని కాని కోర్టులను  కోరవచ్చు.14 రోజులలోపు ఆ వ్యక్తి అఫిడవిట్​ను దాఖలు చేయాల్సి ఉంటుంది.  ధర్మాసనం విచారించి నిర్ణయం తీసుకుంటుంది. నిందితుడు మనస్ఫూర్తిగా  క్షమాపణ  చెప్పినట్లయితే న్యాయస్థానం అతడిని విడుదల చేయవచ్చు.  ఈ రెండు పద్ధతుల్లో తప్ప మరో రకంగా కస్టడీలోకి తీసుకుని జైలుకి పంపించే అధికారం కోర్టులకు లేదు. ఈ రెండు శాసనాలకి విరుద్ధంగా  ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు న్యాయమూర్తి ప్రవర్తించినాడు.  న్యాయమూర్తులను ‘మైలార్డ్’ లని అనగానే వాళ్లేమీ ‘దైవాంశ సంభూతులు’  ఏమీ కాదు. ‘ఒక్క కేసు చాలు’ అన్న కవితా సంపుటిలో ఇలా అంటాను. ‘చట్టం ముందు అందరూ సమానులే.. ఈ సూత్రం దైవానికి  వర్తించదు.. దైవాన్ని  ప్రార్థించాలి తప్ప ప్రశ్నించకూడదు. ప్రశ్నించరాదు’. ఈ వాక్యాలలోని గూఢార్థాన్ని  గ్రహించాలి.   ఇప్పుడు  కోర్టుల్లో ఉన్న పరిస్థితి ఈ  నాలుగు  చరణాలలో  కనిపిస్తున్నది.  

అధికారాలను సంయమనంతో ఉపయోగించాలి

న్యాయమూర్తులు ఎలా ఎంపిక అవుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  ఈ నియమాన్ని న్యాయమూర్తులు మరిచిపోతున్నారు.  కానీ, న్యాయమూర్తులు కాగానే అహం చాలామందిలో పెరుగుతున్నట్టు కనిపిస్తోంది.  ఉన్నత న్యాయస్థానాల్లోని న్యాయమూర్తులకు  గొప్ప వినయం, అణకువ ఉండాలి.  ఎందుకంటే వారికి అపారమైన అధికారాలు ఉంటాయి. ఆ అధికారాలను సంయమనంతో ఉపయోగించకపోతే  న్యాయవ్యవస్థ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉంటుంది. 

ఇక ఆంధ్రప్రదేశ్​ హైకోర్టులో జరిగిన సంఘటన విషయానికొస్తే ..  సోషల్​మీడియాలో  వైరల్ అవుతున్న వీడియోని, లా వెబ్ జర్నల్స్​లో వచ్చిన కథనాలను గమనిస్తే అర్థమైన విషయం ఏమిటంటే..  తన క్లయింటుపై లుక్​అవుట్​ సర్క్యులర్​ జారీ చేయడం, పాస్​పోర్టులను జప్తు చేయడాన్ని సవాలు చేస్తూ  దాఖలైన రిట్​ పిటిషన్​ విచారణ సందర్భంగా సోమవారం (మే4న) నాడు ఈ సంఘటన జరిగింది.  తెలంగాణ రాష్ట్ర హైకోర్టు  మెర్రమల్లి శ్రీనివాస్​ కేసులో ఇచ్చిన సరైన కారణాలు చూపకుండా లుక్​అవుట్​ (ఎల్​ఓసీ)లను నిరవధికంగా కొనసాగించాలేమని చెప్పారు.  

అదే విషయం ఆ న్యాయవాది చెప్పాడు. అయితే, ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు కూడా ఇలాంటి కేసులో ఓ తీర్పు ఇచ్చిందని  దాన్ని సమర్పించమని న్యాయమూర్తి న్యాయవాదిని కోరారు.  దానికి ఆ న్యాయవాది తన చేతిలోని ఫైలుని విసిరివేశాడని అంటున్నారు. అది వీడియోలో కనిపించలేదు. కానీ ఆ విషయం వారి సంభాషణల్లో వినిపించింది.  నా చేయినొప్పి కారణంగా ఫైలు కిందపడిందని ఆ న్యాయవాది కోర్టుకి విన్నవించాడు.  కానీ, ఆ హైకోర్టు న్యాయమూర్తి ఆ విషయాన్ని పరిగణనలోకి  తీసుకోలేదు.  

పరస్పరం గౌరవాన్ని పాటించాలి

నేనేమైనా మీ కేసుని డిస్మిస్​ చేశానా? మీరేమైనా సీనియర్​ న్యాయవాది అనుకుంటున్నారా.. పోలీసులను పిలవండి. ఇతణ్ని 24గంటలపాటు కస్టడీలోకి తీసుకొమ్మని ఉత్తర్వు జారీ చేస్తున్నాను అని న్యాయమూర్తి  ఉత్తర్వులు జారీ చేయగానే,  తన తప్పుని మన్నించమని, క్షమించమని రెండు చేతులు జోడించి ఆ న్యాయవాది కోర్టును వేడుకున్నాడు.  కట్ట విసిరి వేయడానికి ఎంత ధైర్యం మీకు?  ఇతణ్ని  రిజిష్ట్రార్​ జ్యుడీషియల్​ దగ్గరకు పంపించండి.  తీసుకెళ్లండి. తీసుకొని లోపలవేయండి. అని  ఆ హైకోర్టు న్యాయమూర్తి ఆగ్రహంతో అన్నారు.  ఇది స్థూలంగా అక్కడ జరిగింది. ఈ ఘటన మీద బార్​ కౌన్సిల్​ ఆఫ్​ ఇండియా ఆ న్యాయమూర్తిపై  చురుకైన వైఖరిని  తీసుకుంది.   

ఆ న్యాయమూర్తి వైఖరి తీవ్ర ఆందోళనకరంగా ఉందని, అనుచితంగా ఉందని పేర్కొంటూ ఆయన న్యాయ విధులను ఉపసంహరించాలని, అతణ్ని మరో హైకోర్టుకు బదిలీ చేయాలని డిమాండ్​ చేస్తూ బీసీఐ   సీజేఐకి లేఖ రాసింది.  న్యాయవాదిని బహిరంగంగా అవమానించడాన్ని బీసీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. న్యాయమూర్తులు, న్యాయవాదులు పరస్పరం గౌరవాన్ని పాటించాలని నొక్కి చెప్పింది.  ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్​ కావడంతోపాటు బార్​ కౌన్సిల్​ ఆఫ్​ ఇండియా నుంచి ఫిర్యాదు రావడంతో  భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్​ ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు నుంచి పూర్తిస్థాయి నివేదికను కోరారు.  

ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు బార్​ అసోసియేషన్​ సభ్యులు జోక్యం చేసుకున్న తరువాత  న్యాయమూర్తి తన ఆదేశాలను వెనక్కి తీసుకున్నారు.  ఆ తరువాత మే 6న  అసోసియేషన్​ ఒక తీర్మానం చేసింది.  ఈ సమస్యను సౌహార్ర్ద పూర్వకంగా  పరిష్కరించుకున్నామని, ఈ విషయాన్ని ఇక పెద్దది చేయవద్దని తీర్మానం చేశారు. సహజంగానే న్యాయవాదుల సంఘం  న్యాయవాది తరఫున కాకుండా జడ్జి పక్షాన తీర్మానాన్ని చేశారు. 

న్యాయబద్ధత.. 

అధికారం ఉందని వినియోగించడం కాదు. ఆ అధికారానికి న్యాయబద్ధత ఉండాలి.  ఆ న్యాయవాదిని కస్టడీలోకి తీసుకుని లోపల వేయండి అన్న ఉత్తర్వులకు భారతీయ నాగరిక్​ సురక్షా సంహింత ప్రకారం కానీ, కోర్టు ధిక్కారణ చట్టం ప్రకారంకానీ న్యాయబద్ధత లేదు.  ఇంత చిన్న లాజిక్​ను  న్యాయమూర్తి  ఎలా విస్మరించారు.  నేషనల్​  జ్యడీషియల్​ అకాడమీలను  మరింత  పటిష్టం చేయాల్సిన అవసరాన్ని,  దాంతోపాటు న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియను పటిష్టం చేయాల్సిన అవసరం కనిపిస్తుంది.  అహంకారం లేని న్యాయమూర్తి ఉండటం ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. అహంభావం ఉన్న న్యాయమూర్తి తన పదవీ ప్రమాణాన్ని ఉల్లంఘించినట్టే.  ఎందుకంటే అహంభావం  తార్కికతను  మబ్బుపరుస్తుంది. ఇది న్యాయవాదులకు కూడా వర్తిస్తుంది.

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- డా. మంగారి రాజేందర్,​జిల్లా జడ్జి (రిటైర్డ్)
ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.