కోతలు వద్దు.. పూర్తి జీతం ఇవ్వండి..ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ఆగడాలపై ఓపీఎస్ల ఆందోళన 

కోతలు వద్దు.. పూర్తి జీతం ఇవ్వండి..ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ఆగడాలపై ఓపీఎస్ల ఆందోళన 
  • సాలరీలో డబుల్ కటింగ్ చేస్తున్నా పీఎఫ్​ ఖాతాల్లో జమ చేస్తలేరని ఆవేదన
  • న్యాయం చేయాలంటూ డీపీఓలకు వినతి పత్రాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా అవుట్ సోర్సింగ్  ఏజెన్సీల ఆగడాలు, అక్రమాల తీరుపై ఔట్​సోర్సింగ్​ పంచాయతీ కార్యదర్శలు (ఓపీఎస్​ ) నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టార్జితం నుంచి పీఎఫ్, ఈఎస్ఐ పేరుతో  కోతలు విధిస్తున్న ఏజెన్సీలు.. ఆ మొత్తాన్ని తిరిగి తమ ఖాతాల్లో జమచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘మాకు ఆ కటింగ్‌‌‌‌‌‌‌‌లు వద్దు. మా పూర్తి జీతం మాకే ఇచ్చేయండి” అని డీపీఓలకు వినతిపత్రాలు సమర్పిస్తున్నారు.

రాష్ట్రంలో 1,030 మంది ఔట్​సోర్సింగ్​ పద్ధతిలో పంచాయతీ సెక్రటరీలుగా పనిచేస్తున్నారు. వీరికి రూ.12 వేల నుంచి 13 వేల వరకు వేతనం వస్తుంది. ఇందులోనే పీఎఫ్, ఈఎస్ఐ, జీఎస్టీ పేరుతో ఏజెన్సీలు వారి జీతం నుంచి కట్​ చేస్తున్నాయి. దీంతో చేతికి రూ.7,500 నుంచి రూ.8000 వరకు వస్తున్నాయని, అది కూడా ఐదారు నెలలకోసారి జీతాలు తమ ఖాతాలో పడుతున్నాయని ఓపీఎస్​లు వాపోతున్నారు.

కాగా.. సాధారణంగా ఉద్యోగి వాటా కింద కొంత మొత్తం పీఎఫ్  కట్ అవ్వాలి. కానీ, కొన్ని ఏజెన్సీలు సిబ్బందికి తెలియకుండానే రెట్టింపు మొత్తాన్ని కోత విధిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. కట్  చేసిన సొమ్ము సకాలంలో ఈపీఎఫ్  ఖాతాల్లో జమ అవుతుందా అంటే అదీ లేదు. నెలల తరబడి వేచిచూసినా అకౌంట్లలో డబ్బులు పడకపోవడంతో అత్యవసర సమయంలో లోన్లు తీసుకునేందుకు లేదా విత్‌‌‌‌‌‌‌‌డ్రా చేసుకునేందుకు వీలు లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏజెన్సీల నిర్వాకంతో తాము ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నామని కొన్ని జిల్లాల ఓపీఎస్లు ఆయా జిల్లా పంచాయతీ అధికారులను ఆశ్రయించారు. తమకు ఎలాంటి మినహాయింపులు లేకుండా పూర్తి వేతనాన్ని అందించాలని కోరారు. నిజామాబాద్​, ఆదిలాబాద్, సూర్యాపేట, జయశంకర్​ భూపాలపల్లి, జనగామ తదితర జిల్లాల్లో ఏజెన్సీలు, నిర్వాహకులు ఇష్టారీతిన వ్యవరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి జీతం వచ్చినా.. సకాలంలో ఓపీఎస్​ల ఖాతాలో జమచేయకుండా జాప్యం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.  

జీతం కట్​ చేస్తున్నా.. కలపడం లేదు.. 

వాస్తవానికి పీఎఫ్  వల్ల ఉద్యోగికి మేలు జరుగుతుంది. ఉద్యోగి జీతం నుంచి రూ.1000 కట్ చేస్తే, ఏజెన్సీ మరో రూ.2 వేల వరకు యాడ్  చేయాల్సి ఉంటుంది. దీనివల్ల భవిష్యత్తులో రెట్టింపు సొమ్ము వెనక్కి వస్తుంది. అయితే, ఏజెన్సీలు ఈ సొమ్మును సక్రమంగా జమ చేయకపోవడం, చేతికి అందే కొద్దిపాటి జీతాలను కూడా కటింగ్‌‌‌‌‌‌‌‌ల పేరుతో తగ్గిస్తుండడంతో..  ఓపీఎస్​లు ఆందోళన చెందుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 600 నుంచి 700 వరకు ఔట్​సోర్సింగ్​ పంచాయతీ కార్యదర్శలను జూనియర్​ పంచాయతీ కార్యదర్శులుగా కన్వర్ట్​ చేశారని, ఇంకా 1030 మంది వరకు ఉంటారని వారిని జూనియర్​ పంచాయతీ కార్యదర్శులు గుర్తించాలని కోరుతున్నారు. గవర్నమెంట్​ ఓపెన్​ నోటిఫికేషన్​ ద్వారా పరీక్ష రాసి వచ్చామని, జేపీఎస్​ లిస్ట్​వైజ్​గా తీసుకున్నారని, జూనియర్​ పంచాయతీ సెక్రటరీగా కాకుండా ఓపీఎస్​ గా తీసుకున్నారని వాపోతున్నారు.