- రెండో దశలో 800 మెగావాట్లకే విద్యుత్ కొనుగోలు ఒప్పందం
- మూడు యూనిట్ల నిర్మాణంపై సందిగ్ధం
గోదావరిఖని, వెలుగు: ఏపీ పునర్విభజన చట్టం -2014 ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లనిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నది. కానీ 12 ఏండ్లు అవుతున్నా ఇందులో 1600 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది. మిగిలిన 2,400 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది.
రామగుండం ఎన్టీపీసీకి చెందిన స్థలంలో రెండు దశల్లో 800 మెగావాట్ల చొప్పున ఐదు యూనిట్ల(మొత్తం 4 వేల మెగావాట్ల విద్యుత్)ను నెలకొల్పాలని నిర్ణయించారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం(పీపీఏ) సరైన సమయానికి చేసుకోకపోవడంతో రెండేండ్ల తర్వాత 2016 జనవరిలో ఫస్ట్ ఫేజ్ 1,600 మెగావాట్ల(800 మెగావాట్ల రెండు యూనిట్లు) ప్లాంట్ నిర్మాణ పనులను మొదలు పెట్టారు. ఐదేండ్లలో పూర్తి కావాల్సిన ప్లాంట్ నిర్మాణానికి వివిధ కారణాల వల్ల ఏడేళ్ల సమయం పట్టింది. అడ్వాన్సుడ్ ఆల్ట్రా సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో మొదటి యూనిట్(800 ఎంవీ) 2023 సెప్టెంబర్‌లో, రెండో యూనిట్(800 ఎంవీ) 2024 మార్చిలో నిర్మాణం పూర్తి చేసుకుని విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాయి. మొదటి దశలో మొత్తం 1,600 మెగావాట్ల విద్యుత్‌లో 85 శాతం తెలంగాణ రాష్ట్రమే తీసుకుంటున్నది.
800 మెగావాట్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే..
ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించే స్టేజ్ 2లో మొదటి 800 మెగావాట్ల కరెంటును కొనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 2న ఎన్టీపీసీ కమర్షియల్ వింగ్ ఆఫీసర్లకు, తెలంగాణ రాష్ట్ర ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ ఆఫీసర్లకు మధ్య ఒప్పందం జరిగింది. కానీ స్టేజ్ 2లో భాగంగా మరో 800 మెగావాట్ల రెండు యూనిట్లకు ఇంకా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ కావాల్సి ఉంది.
800 మెగావాట్ల రెండో యూనిట్ విద్యుత్‌ను కొనాలని ఎన్టీపీసీ యంత్రాంగం పంజాబ్, కర్నాటక, గుజరాత్ రాష్ట్రాలతో చర్చలు జరుపుతోంది. ఆయా రాష్ట్రాలు ఈ 800 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేయడానికి ముందుకు వస్తే ఇక మిగిలిన మరో 800 మెగావాట్ల విద్యుత్‌ను డిమాండ్‌కు అనుగుణంగా ఏ రాష్ట్రానికైనా విక్రయించేందుకు ఎన్టీపీసీ సిద్దంగా ఉంది. కానీ ఇప్పటి వరకు ఆయా రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై స్పష్టత రాలేదు.
మొదలు కాని స్టేజ్ 2 పనులు..
ఎన్టీపీసీ తెలంగాణ స్టేజ్ 2 నిర్మాణ బాధ్యతలు భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్(బీహెచ్ఈఎల్)కే దక్కాయి. ఈ ఏడాది మార్చి 29న ఎన్టీపీసీ సంస్థ నోటిఫికేషన్ ఆఫ్ ఆవార్డు ద్వారా బీహెచ్ఈఎల్కు ప్లాంట్ నిర్మాణ పనులు అప్పగిస్తూ లెటర్ రాసింది. మొదటి యూనిట్‌ను 54 నెలల్లో, రెండో యూనిట్‌ను 58 నెలల్లో, మూడో యూనిట్‌ను 62 నెలల్లో నిర్మించాలని ఎన్టీపీసీ సంస్థ సూచించింది. కానీ ఇప్పటి వరకు స్టేజ్ 2 ప్లాంట్‌కు సంబంధించిన పనులు ప్రారంభం కాకపోవడంతో దీని నిర్మాణం విషయంలో సందిగ్ధత నెలకొంది.
పీపీఏ కోసం పడిగాపులు..
స్టేజ్ 2లో 800 మెగావాట్ల సామర్థ్యం గల మూడు యూనిట్లను నిర్మించడానికి అవసరమైన స్థలం అందుబాటులో ఉంది. అలాగే ఎల్లంపల్లి నుంచి నీరు, సింగరేణి, వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్(డబ్ల్యూసీఎల్) నుంచి బొగ్గు రవాణా జరుగుతోంది. ప్లాంట్ నిర్మాణానికి అవసరమైన పర్యావరణ అనుమతులు 2024లో వచ్చాయి.
ప్లాంట్ నుంచి వెలువడే బూడిదను నింపడానికి కుందనపల్లి సమీపంలో పాత రాజాపూర్ వద్ద వెయ్యెకరాల స్థలం అందుబాటులో ఉంది. ఇవన్నీ ఉన్నప్పటికీ ఎన్టీపీసీ తెలంగాణ స్టేజ్ 2 ప్లాంట్ కోసం పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకోవడం లేదు. బీఆర్ఎస్ హాయాంలో స్టేజ్ 2 నిర్మాణం చేయాల్సి ఉన్నప్పటికీ స్థానికంగా కాకుండా యాదాద్రిలో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ప్లాంట్ నెలకొల్పింది. దీంతో ఎన్టీపీసీతో విద్యుత్ కొనడానికి ఆనాటి ప్రభుత్వం ముందుకు రాలేదు.
