వెలుగు ఓపెన్ పేజీ..బెంగాల్ తీర్పు మార్పు తెచ్చేనా?

వెలుగు ఓపెన్ పేజీ..బెంగాల్ తీర్పు మార్పు తెచ్చేనా?

భారతదేశ చరిత్రలో బెంగాల్‌కు ఒక ప్రత్యేక స్థానం ఉంది.  బెంగాల్​లో కాంగ్రెస్, కమ్యూనిస్టుల  పరిపాలనలు దశాబ్దాల పాటు జరిగాయి. ఇప్పుడు  గత దశాబ్దన్నర కాలంగా  నడిచిన మమతా బెనర్జీ పాలనను ప్రజలు మార్చడం చిన్నవిషయమేమీ కాదు.  శాంతిభద్రతలు,  బెంగాలీల  బతుకుదెరువు వలసలు, అక్రమ వలసలు,  నిరుద్యోగం వంటి అంశాలు కీలకంగా మారాయని ఫలితాలు చెపుతున్నాయి. అలాగే,  మైనారిటీ ఓట్ల ఏకీకరణ,  హిందూ ఓట్ల ధ్రువీకరణ  అందుకు తోడైనాయని కూడా చెపుతున్నాయి.

స్వాతంత్ర్య  పోరాటం నుంచి సాహిత్యం, సంస్కృతి, రాజకీయాలు, విద్య, ఆర్థిక రంగాల వరకు  ప్రతి విభాగంలో బెంగాల్ దేశానికి మార్గదర్శకంగా నిలిచింది. ఈరోజు బెంగాల్ ఆలోచిస్తే రేపు భారత్ ఆలోచిస్తుంది అనే నానుడి యాదృచ్ఛికంగా రాలేదు. కాలానుగుణంగా మార్పులను స్వీకరించి దేశానికి దిక్సూచిగా నిలవడం బెంగాల్ ప్రత్యేకత.  బెంగాల్ మార్పు గురించి  మాట్లాడితే  ముందుగా విద్య, సాంస్కృతిక  రంగాలను ప్రస్తావించాలి. రాజా రామమోహన్ రాయ్,  ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్,  రవీంద్రనాథ్  ఠాగూర్ వంటి మహనీయులు సామాజిక సంస్కరణలకు  శ్రీకారం చుట్టారు.  

బాల్యవివాహాల నిర్మూలన, మహిళా విద్య, ఆధునిక విద్యా వ్యవస్థ వంటి అంశాల్లో బెంగాల్ ముందడుగు వేసింది. ఆ మార్పులు  క్రమంగా దేశమంతటా వ్యాపించాయి.  నేటికీ విద్య,  సాహిత్యం, కళల విషయంలో బెంగాల్  ప్రత్యేక  గుర్తింపును కొనసాగిస్తోంది.రాజకీయ పరంగా కూడా బెంగాల్ ఎప్పుడూ దేశ దృష్టిని ఆకర్షిస్తుంది. స్వాతంత్ర్య ఉద్యమంలో సుభాష్ చంద్రబోస్ వంటి నేతలు జాతీయ భావజాలాన్ని బలపరిచారు. అనంతరం వామపక్ష రాజకీయాల కేంద్రంగా బెంగాల్ నిలిచి భూసంస్కరణలు, గ్రామీణ అభివృద్ధి వంటి అంశాల్లో దేశానికి కొత్త నమూనాలను చూపించింది. తరువాత రాజకీయ మార్పులతో ప్రాంతీయ పార్టీల  ఎదుగుదలకు  చోటుచేసుకుంది. 

గతమెంతో ఘన కీర్తి

 ఒకప్పుడు జూట్ పరిశ్రమలు, నౌకాశ్రయాలు, వ్యాపార కేంద్రాలతో దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన అండగా ఉన్న బెంగాల్,  కొన్ని దశాబ్దాల్లో పరిశ్రమల క్షీణతను ఎదుర్కొంది. అయితే  ఇటీవల ఐటీ, సేవారంగం, స్టార్టప్‌ల అభివృద్ధి ద్వారా కొత్త అవకాశాల వైపు  అడుగులు వేస్తోంది.   కోల్​కతా  వంటి నగరాలు మళ్లీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి.  సామాజిక  రంగంలో బెంగాల్ ఎప్పుడూ చైతన్యానికి కేంద్రబిందువుగా నిలిచింది. సాహిత్యం, సినిమా, నాటకరంగం ద్వారా ప్రజల్లో సామాజిక అవగాహన పెంచడం బెంగాల్ ప్రత్యేకత.  సత్యజిత్ రే సినిమాలు, బెంగాలీ సాహిత్యం దేశవ్యాప్తంగా ప్రభావం చూపాయి.  మేధావుల చర్చలు,  రాజకీయ చైతన్యం అక్కడి సమాజాన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. ప్రజలలో ప్రశ్నించే ధోరణి ఎక్కువగా ఉండటం కూడా బెంగాల్  ప్రత్యేకతగా చెప్పవచ్చు. బెంగాల్ ఎదుర్కొంటున్న  సవాళ్లను కూడా విస్మరించలేం. నిరుద్యోగం,  రాజకీయ హింస,  వలసలు, పరిశ్రమల కొరత వంటి  సమస్యలు రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకులుగా మారుతున్నాయి. అయినప్పటికీ బెంగాల్  ప్రజలలో  ఉన్న  సృజనాత్మకత,  చైతన్యం, మార్పును  స్వీకరించే  స్వభావం ఈ సమస్యలను అధిగమించే శక్తిని ఇస్తోంది.  

ఆలోచనా విధానాన్ని అందించింది​

జాతీయ పార్టీలకు  బెంగాల్  ఒక రాజకీయ పరీక్షా స్థలంగా మారింది.  అక్కడి  ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయ ధోరణులపై ప్రభావం చూపుతున్నాయి. సామాజిక సమీకరణాలు, మైనారిటీ రాజకీయాలు, సంక్షేమ పథకాల ప్రభావం వంటి అంశాల్లో బెంగాల్ ఒక ప్రయోగశాలగా కనిపిస్తోంది.  మొత్తానికి బెంగాల్ కేవలం ఒక రాష్ట్రం మాత్రమే కాదు  అది భారతదేశ ఆలోచనా విధానానికి  ప్రతిబింబం.  నేడు  మారుతున్న భారతదేశంలో  అభివృద్ధి,  ప్రజాస్వామ్యం,  సామాజిక  సమానత్వం  కలగలిపిన మార్గాన్ని  చూపగలిగితే  బెంగాల్ నిజంగా  దేశానికి  దిక్సూచిగా నిలుస్తుంది.

- సొప్పరి నరేందర్, హైదరాబాద్ సెంట్రల్​ యూనివర్సిటీ
ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.