పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వండి..90 శాతం నిధులతో ప్రాజెక్టును కేంద్రమే పూర్తి చేయాలి: కవిత

పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వండి..90 శాతం నిధులతో ప్రాజెక్టును కేంద్రమే పూర్తి చేయాలి: కవిత
  • ప్రధాని మోదీకి బహిరంగ లేఖ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీని తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) చీఫ్​కవిత డిమాండ్​చేశారు. పాలమూరు–-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, జనగణనలో బీసీ గణన, మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా, తెలంగాణ బీసీ బిల్లుకు ఆమోదం వంటి వాటికి ఆమోదం తెలిపాలన్నారు. ప్రధాని ఆదివారం తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో శనివారం ఆయా అంశాలపై ఆమె బహిరంగ లేఖ రాశారు.

మహబూబ్‌‌నగర్, రంగారెడ్డి, నల్గొండ వంటి కరువు ప్రాంతాలకు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు జీవనాడి అని, 12.31 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాల్సిందేనని పేర్కొన్నారు. 90 శాతం కేంద్రం నిధులతో ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలన్నారు. దేశంలో బీసీల జనాభాపై కచ్చితమైన గణాంకాలు లేవని, ఈ కారణంగా ఆయా వర్గాలకు అందాల్సిన అభివృద్ధి పథకాలు అందడం లేదని తెలిపారు.

2027 జనాభా లెక్కల్లో బీసీల కోసం ప్రత్యేక కాలమ్‌‌ చేర్చాలని, వారి కులాల పేర్లు స్పష్టంగా పేర్కొనేలా జనగణన ఉండాలన్నారు. చట్టసభల్లో మహిళలకు కేటాయించే 33 శాతం రిజర్వేషన్లలో బీసీ మహిళలకు ప్రత్యేక సబ్ కోటా కల్పించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ బిల్లు చేసిందని, అది రాష్ట్రపతి ఆమోదం పొందేందుకు సహకరించాలని కోరారు.