తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో చెన్నై గెలిచింది. 2026 మే 10వ తేదీన చెన్నై చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో లక్నోపై గెలిచి హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. లక్నో నిర్దేశించిన 204 టార్గెట్ ను 4 బంతులు మిగిలి ఉండగా ఛేజ్ చేసింది. ఈ గెలుపుతో ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా నిలుపుకుంది.
అయితే భారీ రన్ రేట్ సాధించే అవకాశాన్ని కోల్పోయింది. ఉర్విల్ పటేల్ ఇచ్చిన ఊపును కంటిన్యూ చేయలేకపోయారు. 23 బంతులలో 65 రన్స్ చేసి.. భారీ తేడాతో గెలిచే ఛాన్స్ ఇచ్చాడు ఉర్విల్. కానీ అతడు ఔటయ్యాక బ్యాటర్లు మెల్లిగా ఆడటంతో మ్యాచ్ చివరి ఓవర్ వరకు వచ్చింది. దీంతో చెన్నై భారీ రన్ రేట్ మిస్సయ్యిందనే చెప్పాలి. ఇవాల్టి గెలుపుతో 12 పాయింట్లతో 5వ స్థానానికి వెళ్లింది చెన్నై. దీంతో చెన్నై ప్లే ఆఫ్ ఆశల పదిలంగా ఉన్నాయనే చెప్పవచ్చు.
ఛేజింగ్ లో చెన్నై బ్యాటర్లు టీమ్ రన్ రేట్ సాధించాలనే లక్ష్యంతో ఆరంభం నుంచే రప్పా రప్పా ఉతికారేశారు. ముఖ్యంగా ఉర్విల్ పటేల్ చెలరేగిన తీరు చూస్తే పూనకాలు రావాల్సిందే. 13 బంతుల్లో ఉర్విల్ పటేల్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసి.. ఐపీఎల్ హిస్టరీలో ఈ చెన్నై బ్యాటర్ సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేశాడు. 7 సిక్సులు, 2 ఫోర్లతో 50 పూర్తి చేసిన ఉర్విల్.. RR బ్యాటర్ జైస్వాల్ రికార్డ్ ను సమం చేశాడు. 23 బంతులలో మొత్తం 8 సిక్సులు, 2 ఫోర్లతో 65 రన్స్ చేసి శహబాజ్ అహ్మద్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఉర్విల్ ఆట చూస్తున్నంత సేపూ.. ఐపీఎల్ లో గేల్ రికార్డు బద్ధలవుతుందా అన్న అనుమానం కలిగింది.
అంతకు ముందు ఓపెనర్లు సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ శుభారంభాన్నిచ్చారు. 14 బంతులలో 2 సిక్సులు, 3 ఫోర్లతో శాంసన్ 28 రన్స్ చేశాడు. దిగ్వేశ్ సింగ్ బౌలింగ్ లో బౌల్డయ్యాడు. రుతురాజ్ 28 బంతులు ఆడి 2 సిక్సులు, 3 ఫోర్లతో 42 రన్స్ చేసి శహబాజ్ అహ్మద్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. కార్తీక్ శర్మ 20), బ్రివిస్ (10) ఔటయ్యాక.. శివమ్ దూబె, ప్రశాంత్ వీర్ ఫినిషింగ్ ఇచ్చారు. దూబె 20వ ఓవర్లో వరుసగా రెండు సిక్సులతో విన్నింగ్ షాట్ ఆడటంతో చెన్నై గెలుపు నమోదు చేసుకుంది. చివరలో ప్రశాంత్ వీర్ 18, దూబె 15 రన్స్ చేశారు.
లక్నో బౌలర్లలో శహబాద్ అహ్మద్ 2 వికెట్లు, దిగ్వేశ్ సింగ్ 2, ఆవేశ్ ఖాన్ ఒక వికెట్ తీసుకున్నారు.
అంతకు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లక్నో.. నిర్ణీత 20 ఓవర్లలో 203 రన్స్ చేశారు. లక్నో ఓపెనర్లలో జోష్ ఇంగ్లిస్ జోష్ కు చెన్నై బౌలర్లు విలవిలలాడారు. ఒకానొక దశలో 30 బంతులలోపే సెంచరీ చేస్తాడేమో అన్నంతగా చెలరేగాడు. చివరికి 33 బంతులలో 85 రన్స్ కొట్టి ఓవర్టన్ బౌలింగ్ లో సంజూ శాంసన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. మొత్తం 33 బంతులలో 6 సిక్సులు, 10 ఫోర్లతో వీర విహారం చేశాడు ఇంగ్లిస్. ఇంగ్లిస్ ఇన్నింగ్స్ తో ఈ మాత్రం స్కోర్ వచ్చింది లేదంటే.. లక్నో అట్టర్ ఫ్లాప్ అయ్చేదేనా..? అనే డౌట్ రాకమానదు.
ఆ తర్వాత బ్యాటర్లంతా చేతులెత్తేయటంతో నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 203 రన్స్ మాత్రమే చేయగలిగారు. షాహబాజ్ అహ్మద్ ఒక్కడు చివరిలో ఫోర్లు, సిక్సులతో మెరుపులు మెరిపించాడు. 25 బంతులలో 3 సిక్సులు, 3 ఫోర్లతో 43 రన్స్ చేసి స్కోర్ 200 దాటించాడు.
ఇంగ్లిస్ తర్వాత లక్నో బ్యాటర్లు వరుసగా పెవిలియన్ క్యూ కట్టడంతో భారీ స్కోర్ మిస్ చేసుకుంది లక్నో. ఇంగ్లిస్ తర్వాత ఒక్క షహబాజ్ అహ్మద్ మాత్రమే 43 రన్స్ చేసి స్కోర్ 200 దాటడంలో కీలక పాత్ర వహించాడు. ఇక మిగతా వారిలో ఒక్కరంటే ఒక్కరు 20 రన్స్ పైగా చేయలేదంటే ఎంత అధ్వానంగా ఆడారో అర్థం చేసుకోవచ్చు. లక్నో బ్యాటర్ల పేలవ ప్రదర్శనతో 8 వికెట్ల నష్టానికి చెన్నై ముందు 204 రన్స్ టార్గెట్ మాత్రమే పెట్టగలిగారు.
