మీరాలం ట్యాంక్పై ఐకానిక్ బ్రిడ్జి

మీరాలం ట్యాంక్పై ఐకానిక్ బ్రిడ్జి
  • రూ.430 కోట్లతో నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి

హైదరాబాద్​సిటీ, వెలుగు:  మీరాలం   ట్యాంక్ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.430 కోట్లతో ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి గురువారం అనుమతి ఇచ్చింది. ప్రపంచ స్థాయి హంగులతో శాస్త్రిపురం నుంచి  బెంగళూరు హైవేకు కలుపుతూ హెచ్‌‌ఎండీఏ, మూసీ రివర్ డెవలప్‌‌మెంట్ కార్పొరేషన్ కలిసి ఈ బ్రిడ్జిని నిర్మించనున్నాయి. పర్యాటకులను ఆకట్టుకునేందుకు అవసరమైన మరికొన్ని హంగులు కూడా ఇక్కడ నిర్మించనున్నారు. దీని కోసం ఇప్పటికే ఓ ప్రైవేట్​కన్సల్టెన్సీకి డీపీఆర్​ కోసం పనులు అప్పగించినట్టు అధికారులు తెలిపారు. 

మీరాలం చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేయడం వల్ల ఈ ప్రాంతానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయంటున్నారు. ఇందులో పశ్చిమాన దక్కన్​ పార్క్​ నుంచి తూర్పున బెంగళూరు జాతీయ రహదారి మధ్య బ్రిడ్జిని నిర్మించడం వల్ల దక్కన్​ పార్కు నుంచి చింతల్​మెట్​ వైపు వంతెనకు డౌన్​ ర్యాంపు నిర్మిస్తారు. అలాగే కిషన్​బాగ్​నుంచి వంతెన పైకి వెళ్లడానికి అప్​ ర్యాంపు నిర్మించనున్నారు. దీని వల్ల జాతీయ రహదారి నుంచి బహదూర్​పురా, అత్తాపూర్​ వైపు నుంచి  రాకపోకలు సులువు కానున్నట్టు అధికారులు వెల్లడించారు.