
- యూడైస్ లో పేరున్న టీచర్లకే రూ.2 వేలు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయం
- వచ్చిన అప్లికేషన్లేమో 2.10 లక్షలు
- బయటపడ్డ ప్రైవేట్ స్కూళ్ల
- తప్పుడు లెక్కలు
- అందరికీ ఇవ్వాలంటున్న ట్రస్మా
రాష్ట్రంలోని కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్ల బాగోతం బయటపడింది. ప్రభుత్వానికి ఏటా యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ (యూడైస్) కింద ఇచ్చే టీచర్లు, సిబ్బంది వివరాలకు.. తాజాగా ప్రైవేట్ టీచర్లకు సర్కార్ అందించే సాయం కోసం ఇచ్చిన వివరాలకు పొంతనలేకుండా పోయింది. ఈ లెక్కల్లో తేడా ఏకంగా 65 వేలు ఉండడంతో విద్యాశాఖ అధికారులు షాక్ అయ్యారు. ఇంకా స్కూల్ బస్‌డ్రైవర్లు, ప్రీ ప్రైమరీ, ఎయిడెడ్ స్కూళ్లలోని అన్ ఎయిడెడ్ సెక్షన్లకూ సాయమందిస్తే.. ఈ లెక్క మరో 2 లక్షల వరకు పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ లెక్కలను పరిగణనలోకి తీసుకోకుండా, మొదట యూడైస్‌లో పేరున్న 1.45లక్షల మంది రూ.2 వేలు సాయం అందించాలని నిర్ణయించారు.
తప్పుడు లెక్కలపై దృష్టి..
రాష్ట్రంలో 10,815 ప్రైవేట్‌స్కూళ్లకు యూడైస్ కోడ్ ఉండగా, మరో 400 స్కూళ్లు కోడ్ లేకుండానే కొనసాగుతున్నాయి. వీటిలో వెయ్యి స్కూళ్లు రన్నింగ్‌లో లేనివి, గతేడాదే అనుమతి పొందిన కొత్త బడులు ఉన్నాయి. పోయినేటి యూడైస్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1.18 లక్షల మంది టీచర్లు, 27 వేల మంది నాన్‌టీచింగ్ స్టాఫ్ఉన్నారు. అయితే మరో15 వేల వరకు సిబ్బంది పెరుగుతారని భావించి.. ప్రభుత్వం 1.60 లక్షల మందికి రూ.2 వేల చొప్పున అందించేందుకు రూ.32 కోట్లను ఇటీవల రిలీజ్ చేసింది. కానీ అప్లికేషన్లు మాత్రం అంచనాకు మించి వచ్చాయి. దీంతో కొత్త వారికీ సాయం చేయాలనుకున్న అధికారులు.. ఈ అప్లికేషన్లను చూసి, ఆ ఆలోచనను పక్కన పెట్టేశారు. ప్రైవేట్ మేనేజ్మెంట్లు ఇచ్చిన తప్పుడు లెక్కలపై దృష్టిపెట్టారు. ఆయా మేనేజ్మెంట్ల వివరాలను సేకరిస్తున్నారు. ఎక్కువ మందిని చూపిస్తే పీఎఫ్, ఈఎస్ఐ చెల్లించాల్సి వస్తుందని కొన్ని మేనేజ్మెంట్లు.. క్వాలిఫైడ్ టీచర్లు లేకపోవడంతో మరికొన్ని మేనేజ్మెంట్లు సిబ్బంది వివరాలను యూడైస్ లెక్కల్లో అందజేయలేదని తెలుస్తోంది.
క్వాలిఫికేషన్ ఉన్నోళ్లకే...
ప్రభుత్వ ప్రకటించిన రూ.2 వేలు, 25 కిలోల బియ్యం కోసం ఆరు రోజుల్లోనే ఏకంగా 2,09,873 అప్లికేషన్లు వచ్చాయి. వీరిలో 1,56,161 మంది టీచర్లు ఉండగా.. 53,712 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు. అయితే సర్కార్ విడుదల చేసిన సాయం కేవలం 1.60 లక్షల మందికే సరిపోతుంది. మిగిలిన వారికి ఎలా ఇవ్వాలనే దానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. మిగతా వారికీ ఇవ్వాలంటే మరో రూ.13 కోట్లు అవసరం. దీంతో సర్కార్డబ్బులు ఇస్తుందో? లేదో? తెలియకపోవడంతో.. ముందుగా యూడైస్ లో పేర్లున్నోళ్లకే రూ.2 వేలు అందజేయాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. మరోవైపు సరైన క్వాలిఫికేషన్ ఉన్న వారికే సాయం అందించాలని యోచిస్తున్నారు. స్కూల్ బస్సు డ్రైవర్లకు కూడా సాయం అందించాలని విద్యాశాఖ మొదట భావించినప్పటికీ, అప్లికేషన్ల సంఖ్యను చూసి వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. అయితే ప్రీ ప్రైమరీ టీచర్లు, సిబ్బంది, ఎయిడెడ్ స్కూళ్లలోని అన్ఎయిడెడ్ సెక్షన్లు సహా అందరికీ సాయం అందించాలని ప్రైవేట్‌స్కూళ్ల మేనేజ్మెంట్ల సంఘం (ట్రస్మా) డిమాండ్ చేస్తోంది.