
- రూ.96,238 కోట్లు సేకరించాలని ప్రభుత్వ ప్లాన్
న్యూఢిల్లీ: 5జీ స్పెక్ట్రమ్ వేలం అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. ఈ వేలం ద్వారా రూ.96,238 కోట్లు (బేస్ ధర దగ్గర) సేకరించాలని ప్లాన్ చేసిన ప్రభుత్వం, రూ.11,341 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌నే (రేడియోవేవ్స్) అమ్మగలిగింది. ఇది అంచనా వేసిన అమౌంట్‌లో 12 శాతానికి సమానం. రెండు రోజుల పాటు జరిగిన వేలంలో చివరి రోజు బిడ్డింగ్స్ తొందరగా పూర్తయ్యాయి.
టెలికం కంపెనీలు ఆసక్తి చూపించకపోవడంతో బుధవారం ఉదయం 11.30 కి వేలం ముగిసినట్టు అధికారులు ప్రకటించారు. 800, 900, 1800, 2100, 2300,2500, 3300 మెగాహెడ్జ్‌ల బ్యాండ్ విడ్త్‌తో పాటు, 26 గిగాహెడ్జ్ స్పెక్ట్రమ్ వేవ్స్ కోసం వేలం జరిగింది. వీటితో పాటు 140–150 మెగాహెడ్జ్ స్పెక్ట్రమ్ కోసం కూడా వేలం జరిగింది. టెలికం కంపెనీలు ఈసారి స్పెక్ట్రమ్ రెన్యువల్స్‌పై ప్రధానంగా ఫోకస్ పెట్టాయని ఎనలిస్టులు పేర్కొన్నారు. ఈసారి వేలంలో హయ్యెస్ట్ బిడ్డర్‌గా ఎయిర్‌టెల్ నిలిచింది. ఈ కంపెనీ రూ.6,857 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను దక్కించుకుంది.
వొడాఫోన్ ఐడియా రూ.3,510 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను, జియో రూ.974 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేశాయి. 900, 1800, 2100 మెగాహెడ్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్‌లకు డిమాండ్ కనిపించింది. కాగా, చివరిసారిగా 2022లో స్పెక్ట్రమ్ వేలం జరిగింది. ఏడు రోజుల పాటు జరిగిన ఈ వేలం ద్వారా ప్రభుత్వం రూ.1.5 లక్షల కోట్లు సేకరించింది. అప్పుడు జియో రూ.88,078 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసింది.