గ్యాస్ పై రాష్ట్రం పన్నువేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా

గ్యాస్ పై రాష్ట్రం పన్నువేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా

హుజురాబాద్ ఎన్నికల్లో ఈటల రాజేందర్  గెలిస్తే ఇద్దరు పోయి ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలవుతారు తప్ప.. వాళ్ల ప్రభుత్వం వచ్చేది లేదన్నారు మంత్రి హరీశ్ రావు. ఇవి నడమంత్రపు ఎన్నికలు.. ఈ రెండేళ్లు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కు  అవకాశం ఇస్తే డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించి ఇస్తామని తెలిపారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్ పేటలో TRS ఆధ్వర్యలో వడ్డెర సంఘం ఆశీర్వాద సమావేశంలో హాజరైన హరీశ్ రావు మాట్లాడారు. గ్యాస్ పై రాష్ట్రం పన్నువేసినట్లు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా.. లేదంటే నీవు తప్పుకుంటావా అంటూ ఈటలకు సవాల్ విసిరిన హరీశ్. 

TRS మీటింగ్ కు పోవద్దని జమ్మికుంటలో మనిషికి 300 రూపాయలు ఈటల ఇచ్చాడట.. ఇదా లీడర్ చేయాల్సిన పని అని అన్నారు మంత్రి హరీశ్. నన్ను గెలిపించండి.. నేను గీ పనిచేస్తా అని చెప్పాలి తప్ప.. మీటింగ్ కు పోవద్దని చెబుతాడా? అని ప్రశ్నించారు. నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే.. కేసీఆర్ ఇచ్చిన నాలుగువేల ఇండ్లు కట్టించి ఉండేవాడివన్నారు. నీవు మంత్రిగా ఉన్నప్పుడు ఈ పేద జాతి నీ కంటికి కనిపించేలేదు కదా అని అన్నారు. నీవు ఎన్ని చెప్పినా.. ఇనుప తాళ్లతో కట్టేసినా ఆ బంధాలు తెంపుకుని వచ్చి టీఆర్ఎస్ కు ఓటేస్తారని స్పష్టం చేశారు. మనకు ఏమిచ్చిందని ఈటల బీజేపీలోచేరాడని ప్రశ్నించారు. సిలిండర్ ధర పెంచినా ఓర్చుకోండి ..కానీ నాకు ఓటేయమని ఈటల చెబుతాడా? అని అన్నారు. 

గ్యాస్ ధరలో 291 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ పన్ను ఉందని ఈటల ఉందంటున్నాడని..దీనిపై చర్చకు రేపు రమ్మంటావా? ఎల్లుండి రమ్మంటావా? జమ్మికుంట గాంధీ దగ్గరకు రావాలా? హుజురాబాద్ అంబేద్కర్ దగ్గరకు రావాలా చెప్పాలంటూ సవాల్ విసిరారు మంత్రి హరీశ్. 291 రూపాయలు టాక్స్ రాష్ట్ర ప్రభుత్వం వేసి ఉంటే అక్కడే రాజీనామా చేస్తా.. లేదంటే నీవు తప్పుకుంటావా? అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం టాక్స్ ఉందా.. బట్టకాల్చి మీదేస్తారా? అని అన్నారు. ప్రజలను నమ్మిస్తే నమ్మేంత ఎడ్డివాళ్లు కాదు.. మనకంటే తెలివైనవాళ్లన్నారు.  పెట్రోలు, డీజిల్, గ్యాస్ సిలిండర్, మంచినూనే ఇష్టమొచ్చినంత పెంచుతున్నారని.. ఇండ్లు కట్టకపోగా.. ధరలు పెంచే పార్టీలో ఈటల  చేరాడన్నారు. పేదలకు తిప్పలైనా, ఇబ్బందైనా ఓర్చుకోని తనకు ఓటేయమంటున్నాడని చెప్పారు.

ఎన్నికల కోడ్ ముగిసాకా.. మరోసారి మీతో సమావేశమై.. ఒడ్డెరల సమస్యలు పరిష్కరిస్తామన్నారు మంత్రి హరీశ్ రావు. ఎలాగు గెలిచేది గెల్లు శ్రీనేనని... డబ్బులిచ్చి మనుషులను ఆపగలవేమో గానీ.. మనసులో ఉన్న కారు గుర్తు తీసేయలేవు రాజేందర్ అని అన్నారు. వంటరూంలోకి వెళ్లి గ్యాస్ సిలిండర్ కు దండం పెట్టి.. బీజేపీని గుర్తు చేసుకని కసిగా కారు గుర్తుపై ఓటేయాని ప్రజలను కోరారు. కల్యాణలక్ష్మి కావాలంటే టీఆర్ఎస్ కు...  వద్దంటే ఈటలకు ఓటేయండి అన్న హరీశ్..గెల్లు శ్రీనివాస్ గెలిచిన తర్వాత 15 రోజులకు, నెలరోజులకు నేనే వచ్చి ఇచ్చిన ప్రతిమాట నిలబడి నెరవేరుస్తానని అన్నారు.