- ఫ్యూచర్ సిటీ పేరిట ఫేక్ పెట్టుబడులు తెస్తున్నరు: హరీశ్
- ప్రజాభవన్ కాంగ్రెస్ నేతల విందులు, జల్సాలకు అడ్డాగా మారింది
- కాంగ్రెస్ రెండేండ్ల పాలనపై
- చార్జ్‌షీట్ విడుదల
హైదరాబాద్, వెలుగు: రెండేండ్ల రేవంత్ పాలన ప్రజలకు శాపంగా మారిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. రేవంత్ ఊదరగొడుతున్న ఫ్యూచర్ సిటీ.. కేసీఆర్ భూములు సేకరించిన ఫార్మా సిటీవేనన్న విషయం ప్రజలు మర్చిపోరన్నారు. ఇప్పుడు నిర్వహిస్తున్నది గ్లోబల్ సమిట్ కాదని.. గోబెల్స్ సమిట్గా మారిస్తే బాగుంటుందన్నారు. సోమవారం తెలంగాణ భవన్లో రెండేండ్ల కాంగ్రెస్ పాలనపై హరీశ్ చార్జ్‌షీట్‌ను విడుదల చేసి మాట్లాడారు. కాంగ్రెస్‌కు ప్రజలు ఇచ్చిన సమయంలో సగం పూర్తయిందని అన్నారు. ఇక మిగిలింది రెండేండ్లేనని, చివరి ఏడాదంతా ఎన్నికల హడావుడి, ఎలక్షన్ కోడ్‌తోనే సరిపోతుందని చెప్పుకొచ్చారు. రాబోయే రెండేండ్లలో సాధించే ఫలితాల కోసం.. తొలి రెండేండ్లలో ఏమైనా పునాది పడిందా అని ప్రశ్నించారు.
సీఎం ఆఫీసులో రోజూ ప్రజల్ని కలుస్తం.. ప్రజాదర్బార్ నిర్వహిస్తమని మేనిఫెస్టోలో పెట్టారని.. కానీ, ఒక్కరోజు బాగోతంగానే మిగిల్చారని మండిపడ్డారు. ‘‘ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చి తానే స్వయంగా ప్రతీరోజు ప్రజాదర్బార్ నిర్వహిస్తానని రేవంత్ గప్పాలు కొట్టిండు. ప్రజాదర్బార్ పక్కపొంటే ఉండే డిప్యూటీ.. ప్రజాదర్బార్‌లో వచ్చే ఫిర్యాదుల గురించి ఏ రోజూ పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడని ప్రజాభవన్ సీఎల్పీ మీటింగ్ లు పెట్టుకొని పార్టీ మీటింగ్ లకు అడ్డాగా మారింది’’ అని ఆయన పేర్కొన్నారు.
సీఎం, మంత్రుల భారీ స్కామ్‌లు
ప్రజా పాలనలో సీఎం, మంత్రులు భారీ కుంభకోణాలకు పాల్పడుతున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించలేని చేతగాని సర్కారు.. పాలసీల పేరుతో తమ అవినీతిని చట్టబద్ధం చేసుకుంటున్నారని ఆరోపించారు. హైడ్రా పేరిట విలువైన భూములను కొల్లగొట్టే స్కామ్‌కు తెరలేపారన్నారు.

