
పనితనం తప్ప... పగతనం లేని నాయకుడు కెసిఆర్ ఆని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ భవన్ లో మంత్రులు హరీశ్ రావు, కెటిఆర్ సమక్షంలో డాక్టర్ చెరుకు సుధాకర్ శనివారం(అక్టోబర్ 21) బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. చెరుకు సుధాకర్ కరుడుగట్టిన తెలంగాణ ఉద్యమవాది అని, ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరడం సంతోషకరమని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో సుధాకర్ తీవ్రంగా శ్రమించారని తెలిపారు. ఉద్యమకారులపై తుపాకి ఎక్కుపెట్టిన ఘనత ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిది అని... ఉద్యమ సమయంలో రాజీనామా చేయకుండా వెన్ను చూపి పారిపోయిన వ్యక్తి ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అని హరీశ్ రావు మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీకి అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులే లేరని.. అబద్దాలతో ప్రజలను మోసం చేయాలని కాంగ్రెస్ నేతలు చూస్తున్నారని అన్నారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదని.. కాంగ్రెస్ అంటనే మాటలు, ముఠాలు, మంటలు అని అన్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను కాంగ్రెస్ కాపీ కొట్టిందని తెలిపారు. కెసిఆర్ మళ్లీ గెలవాలి.. తెలంగాణ అభివృద్ధి పరుగులు పెట్టాలన్నారు. పనితనం తప్ప... పగతనం లేని నాయకుడు కెసిఆర్.. కెసిఆర్ హయాంలో కరువు, మత కలహాలు లేకుండా రాష్ట్రం ప్రశాంతంగా ఉందని హరీశ్ రావు తెలిపారు.