- మాజీ ప్రెసిడెంట్, అతడి తమ్ముడు,
- పోలీసులు కారణమంటూ సూసైడ్ నోట్
- హయత్ నగర్ లక్ష్మీప్రియ కాలనీలో ఘటన
- డెడ్ బాడీతో కుటుంబ సభ్యుల ఆందోళన
హైదరాబాద్ సిటీ, వెలుగు: రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ డివిజన్ లక్ష్మీప్రియ కాలనీ ప్రెసిడెంట్మధుసూదన్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు మాజీ ప్రెసిడెంట్, అతడి తమ్ముడు, పోలీసులు కారణమంటూ అతడు రాసిన సూసైడ్నోట్కలకలం రేపింది. దీంతో కుటుంబసభ్యులు అతడి డెడ్‌బాడీతో ఆందోళనకు దిగారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా నూతనకల్ కు చెందిన దూడిగం మధుసూదన్ (49), భార్య -వినోద, బిడ్డ ఇందు, కొడుకు సాయితో కలిసి హయత్ నగర్ డివిజన్‌లోని లక్ష్మీప్రియ కాలనీలో స్థిరపడ్డారు. మధుసూదన్ కారు డ్రైవర్ గా పనిచేస్తూ కాలనీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. గతంలో కాలనీ అసోసియేషన్ డబ్బులు ఉపయోగించుకున్నందుకు మాజీ అధ్యక్షుడు యాదగిరిగౌడ్, ప్రస్తుత ప్రెసిడెంట్ మధుసూదన్‌కు -చెక్ రూపంలో రూ.9 లక్షలు చెల్లించాడు.
అయితే, తాను రూ. లక్షకు చెక్కు ఇస్తే తన అకౌంట్ నుంచి రూ.9 లక్షలు డ్రా చేశారని యాదగిరిగౌడ్ హయత్ నగర్ పీఎస్‌లో మధుసూదన్ తో పాటు నిరంజన్ యాదవ్‌పై కేసు పెట్టారు. ఈ విషయమై యాదగిరిగౌడ్, మధుసూదన్ మధ్య 3 నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ కేసులో పోలీసులు మధుసూదన్, నిరంజన్ యాదవ్‌ను, వారి కుటుంబ సభ్యులను పీఎస్‌కు తీసుకొచ్చి విచారించారు. 10 రోజుల క్రితం సూర్యాపేట జిల్లా ఆత్మకూరులో పెండ్లికి హాజరైన మధుసూదన్ ను పోలీసులు ఫోన్ లోకేషన్ ఆధారంగా అరెస్టు చేసి పీఎస్‌కు తీసుకువచ్చారు.
అతడి భార్య, పిల్లలను కూడా తీసుకొచ్చి ఎంక్వైరీ చేశారు. మధుసూదన్ బెయిల్ పొందినప్పటికీ యాదగిరి గౌడ్, ఇతడి తమ్ముడు రమణకు పోలీసులు సపోర్ట్ చేస్తూ తనను వేధిస్తున్నారని సూసైడ్‌నోట్ రాసిన మధుసూదన్ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబసభ్యులు డెడ్‌బాడీతో యాదగిరి ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని వివిధ పార్టీల నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

