హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వృద్ధుల జనాభాకు అనుగుణంగా ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని, అందుకోసం నాన్ కమ్యునికెబుల్ డిసీజెస్ వంటి అంశాలపై సమగ్ర అధ్యయనం అవసరమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి యాక్షన్ ప్లాన్ రూపొందించనున్నట్లు వెల్లడించారు.
సోమవారం బంజారాహిల్స్ లోని తన అధికారిక నివాసంలో ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ మంత్రిని కలిశారు. ఇటీవల చేపట్టిన జపాన్ స్టడీ టూర్ కు సంబంధించిన వివరాలను మంత్రికి వారు వివరించారు. వృద్ధుల సంక్షేమం, ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, అక్కడి ప్రజారోగ్య వ్యవస్థ, హాస్పిటళ్లలో అందుతున్న సేవలు, వృద్ధులకు అందుబాటులో ఉన్న ప్రత్యేక వైద్య సేవలపై ఆరా తీశారు.
జపాన్ స్టడీ టూర్‌కు సంబంధించిన పూర్తి నివేదిక సిద్ధమైన తర్వాత ఈ అంశంపై మరోసారి సమీక్షా సమావేశం నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. మరోవైపు.. టెక్నికల్ కారణాలతో.. ఆలస్యమైన వేతనాల చెల్లింపు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. శానిటేషన్, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్, రెగ్యులర్ ఉద్యోగులతో పాటు విద్యార్థుల స్టైఫండ్స్ కూడా పెండింగ్ లో ఉండకూడదని స్పష్టం చేశారు.
