కవిత బెయిల్ పిటిషన్లపై ఇయ్యాల విచారణ

కవిత బెయిల్ పిటిషన్లపై ఇయ్యాల విచారణ
  •     ఈడీ, సీబీఐ కేసుల్లో జరగనున్న వాదనలు 
  •     రేపటితో ముగియనున్న కవిత జ్యుడీషియల్ కస్టడీ 

న్యూఢిల్లీ, వెలుగు: లిక్కర్ స్కామ్ లో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన రెండు బెయిల్ పిటిషన్లపై సోమవారం ఢిల్లీలోని ట్రయల్ కోర్టు విచారణ చేపట్టనుంది. లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ, మనీ లాండరింగ్ కేసులో ఈడీ కవితను అరెస్టు చేశాయి. అయితే ఈ రెండు కేసుల్లో తన అరెస్టును సవాల్ చేస్తూ కవిత ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. గత నెల 26న ఈడీ కేసులో, ఈ నెల 15న సీబీఐ కేసులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. 

ఈడీ కేసులో వేసిన బెయిల్ పిటిషన్ పై ఈ నెల 16నే వాదనలు జరగాల్సి ఉండగా జడ్జి సెలవులో ఉండడంతో విచారణ సోమవారానికి వాయిదా పడింది. కాగా, ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఇంతకుముందు కవిత పెట్టుకున్న పిటిషన్ ను ట్రయల్ కోర్టు తోసిపుచ్చింది. కొడుకుకు పరీక్షలు ఉన్నాయన్న కారణంతో లిక్కర్ స్కామ్ వంటి నేరాల్లో మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.  

రేపు కోర్టులో హాజరు.. 

కవితకు ట్రయల్ కోర్టు విధించిన జ్యుడీషియల్ కస్టడీ మంగళవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కవితను అదే రోజు ఉదయం రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరుచనున్నారు. ఈడీ కేసులో కవితకు ఈ నెల 23 వరకు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అయితే ఈ నెల 11న కవితను తీహార్ జైలులోనే సీబీఐ అరెస్టు చేసింది. ఆ తర్వాతి రోజు ఆమెను కోర్టులో ప్రవేశపెట్టగా, మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అది ముగియడంతో ఈ నెల 15న మరోసారి కవితను సీబీఐ అధికారులు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. 

కవిత విచారణకు సహరించడం లేదని కోర్టుకు సీబీఐ తెలిపింది. ప్రస్తుత దశలో ఆమెను విచారించాల్సిన అవసరం లేదని, మరికొంత మందిని విచారించాల్సి ఉందని పేర్కొంది. అయితే దర్యాప్తు కీలక దశలో ఉన్నందున కవిత బయట ఉంటే విచారణపై ప్రభావం పడుతుందని చెప్పింది. ఈ అంశాలతో ఏకీభవించిన ట్రయల్ కోర్టు... సీబీఐ కేసులోనూ కవితకు ఈ నెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. దీంతో సీబీఐ, ఈడీ రెండు కేసుల్లోనూ కోర్టు విధించిన జ్యుడీషియల్ కస్టడీ మంగళవారంతోనే ముగియనుంది. కాగా, ఒకవేళ కవిత బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరిస్తే.. కవితకు మళ్లీ 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించే అవకాశం ఉందని న్యాయనిపుణులు చెబుతున్నారు.