హైదరాబాద్, వెలుగు: జాతీయ పతాకంతో ఈ నెల 12, 15 తేదీల్లో నిర్వహించే బైక్ ర్యాలీలకు తగిన షరతులతో అనుమతి మంజూరు చేయాలని పోలీస్ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. జాతీయ జెండాలతో నిర్వహించే ర్యాలీతో వివాదం తలెత్తే అవకాశం ఏముందని ప్రశ్నించింది. సెప్టెంబర్ 17న జరిగే తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా వేర్వేరుగా నిర్వహించ తలపెట్టిన ర్యాలీలకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని సవాలు చేస్తూ.. రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌కు చెందిన సామాజిక కార్యకర్త శ్రీరాములు యాదవ్, బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ మాధవీదేవి విచారణ చేపట్టారు.
పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ఈ నెల 12న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బాలాపూర్ శివాజీ చౌక్ నుంచి చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వరకు, 15న భాగ్యలక్ష్మి ఆలయం నుంచి అసెంబ్లీ వద్ద ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు 150 బైక్‌లతో ర్యాలీ నిర్వహించేందుకు అనుమతించాలని కోరారు. ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈ ర్యాలీలు మతపరమైన ఘర్షణలకు దారితీసే ప్రమాదం ఉందని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్లు సూచించిన మార్గాల్లో నిబంధనలు, షరతులతో ర్యాలీలకు అనుమతి మంజూరు చేయాలని కమిషనర్‌ను ఆదేశిస్తూ విచారణను మూసివేశారు.
