
హైదరాబాద్, వెలుగు: పటాన్ చెరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను శుక్రవారం హైకోర్టు డిస్మిస్చేసింది. ఆధారాల్లేకుండా దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌ను అనుమతించలేమని తేల్చింది. మహిపాల్‌రెడ్డి ఎన్నికను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కాట శ్రీనివాస్ గౌడ్ ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనల అనంతరం ఎమ్మెల్యే ఎన్నికను సవాల్ చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ న్యాయమూర్తి జస్టిస్ కె.శరత్ శుక్రవారం తీర్పు చెప్పారు. ఆధారాల్లేకుండా, అస్పష్ట ఆరోపణలతో వేసిన పిటిషన్‌ను కొట్టేయాలని మహిపాల్‌రెడ్డి వేసిన మధ్యంతర పిటిషన్‌ను అనుమతించారు.
ఇరు పక్షాల వాదనల అనంతరం హైకోర్టు స్పందిస్తూ.. ‘‘నిబంధనలకు వ్యతిరేకంగా రిటర్నింగ్ అధికారి నామినేషన్‌ను అనుమతించారని చెబుతున్న పిటిషనర్ గౌడ్ ఈ విషయాన్ని నామినేషన్ల సమయంలో రిటర్నింగ్ ఆఫీసర్ వద్ద లేవనెత్తలేదు. ఈ నేపథ్యంలో నామినేషన్ అనుమతించడంపై దాఖలైన పిటిషన్‌ను విచారణ చేపట్టలేము. 2014లో నామినేషన్ వేసినప్పుడు టెన్త్ చదివినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారని, 2023 నామినేషన్లలో 9వ క్లాస్ చదివినట్లుగా చూపారంటూ గౌడ్ ఆరోపించారు. అయినా, 9, 10వ తరగతులకు పెద్ద తేడా ఏమీలేదు. ఇదేమీ ఎన్నికలపై ప్రభావం చూపబోదు. అలాగే రుణాలు, వాటి చెల్లింపులు తప్పుగా చూపారనడాగానికి సంబంధిత పత్రాలు లేవు. ఆస్తులు, ఆదాయంపై ఇంటర్నెట్ నుంచి తీసుకున్న కాపీలను కోర్టుకు సమర్పించారు. కనుక ఎన్నికల ప్రక్రియలో అవినీతికి పాల్పడినట్లు పరిగణనలోకి తీసుకోడానికి ఎలాంటి ఆధారాలు లేవు’’ అని పేర్కొన్నది.