
- రంగారెడ్డి కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్, వెలుగు: మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలపై రిపోర్టు సమర్పించాలని ఆదేశించినా అమలు చేయని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తీరుపై శుక్రవారం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
వారంలోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని సర్వే నెం.181, 182, 194, 195ల్లో భూదాన భూములను అన్యాక్రాంతం చేయరాదని, వీటిపై ఏ ఒక్క లావాదేవీలు జరపడానికి వీల్లేదన్న గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టడంపై బిర్ల మల్లేశ్ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్ శుక్రవారం విచారణ చేపట్టారు.