
- తీర్పును వాయిదా వేసిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: గత ఏడాది పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర సభలో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఫిర్యాదును కొట్టివేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో సోమవారం వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలను విన్న హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్‌లను తొలగిస్తుందంటూ జనజాతర సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నల్గొండ జిల్లాకు చెందిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు కింది కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు.
కింది కోర్టులో కేసును కొట్టివేయాలని కోరుతూ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ కె. లక్ష్మణ్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఏదైనా నేరం జరిగినప్పుడు ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చన్నారు. సీఎం తరఫున సీనియర్ న్యాయవాది టి. నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌పై ఫిర్యాదుకు పార్టీ అధిష్టానం అనుమతించినట్టు ఆధారాల్లేవని, అనుమతి లేకుండా ఫిర్యాదు చేయడానికి వీల్లేదన్నారు. అనంతరం తీర్పును వాయిదా వేశారు.