పంజాగుట్ట, వెలుగు: సైనిక్ స్కూళ్ల ప్రవేశాల్లో ప్రాంతం కంటే ప్రతిభకే ప్రాధాన్యత ఇచ్చి సీట్లు కేటాయించాలని మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఆయన మాట్లాడారు. తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాల్లో సైనిక్ స్కూళ్లు పెట్టి, నాలుగు కోట్ల జనాభా ఉన్న తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వకపోవడం అన్యాయమని మండిపడ్డారు.
ప్రవేశ పరీక్షల్లో 280 మార్కులు సాధించిన మన విద్యార్థులను వదిలేసి, కేవలం 140 మార్కులు వచ్చిన ఇతర రాష్ట్రాల లోకల్ విద్యార్థులకు సీట్లు ఇవ్వడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ చొరవ చూపి మన విద్యార్థులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
