భూముల వేలానికి ఆదరణ కరవు 

భూముల వేలానికి ఆదరణ కరవు 

హైదరాబాద్: మరోసారి భూముల వేలానికి సిద్ధమైంది హెచ్ఎండిఏ. సిటీ శివారులోని మూడు ప్రాంతాల్లో ప్లాట్లను ఆన్ లైన్ వేలానికి పెట్టింది. ఈనెల 30 నుంచి వచ్చేనెల 4వరకు వేలం నిర్వహించనుంది. ఐతే వేలానికి ముందు నిర్వహించే ప్రి బిడ్ కు ఆదరణ కరువైంది. ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో అధికారులు టెన్షన్ పడుతున్నారు.  భూముల వేలానికి ఎలాంటి స్పందన రాకపోవడం హెచ్ఎండీఏ అధికారులను పరేషాన్ చేస్తోంది. అయితే కొన్ని ప్రాంతాల్లో భూముల వేలానికి మంచి స్పందన రాగా.. మరికొన్ని ప్రాంతాల్లో అస్సలే అమ్ముడు పోవడం లేదు.

సేల్ కానీ ప్లాట్లను రెండుమూడు సార్లు వేలానికి పెట్టినా వర్కవుట్ కావడం లేదు. ఒకవైపు సర్కార్ ఒత్తిడి.. మరోవైపు కొనుగోలు దారులు ఇంట్రెస్ట్ చూపకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గతంలో హెచ్ఎండీఏ భూముల వేలం వేస్తే.. సిటీ వాళ్లే కాదు ఎన్ఆర్ఐలు కూడా ఆసక్తి చూపేవారు. ఉప్పల్ భగాయత్ ప్లాట్లు, కూకట్ పల్లి, మియాపూర్ లలో ప్లాట్లను ఎగబడి కొన్నారు. కానీ ఇప్పుడు తొర్రూర్, బహదూర్ పల్లి ప్లాట్లకు ఆదరణ కరువైందని అధికారులు చెబుతున్నారు. ఈ రెండు ప్రాంతాల్లోని 233 ప్లాట్ల అమ్మకాలతో 400 నుంచి 500 కోట్ల వరకు ఆదాయం వస్తుందని సర్కార్ భావించింది. కానీ హెచ్ఎండిఏ అధికారులు ముందస్తుగా నిర్వహిస్తున్న ప్రీ బిడ్ కు స్పందన కరువైందని సమాచారం.
బహదూర్ పల్లిలో 51ప్లాట్లు, తొర్రూర్ లో 148 ప్లాట్లతో పాటు తుర్కయాంజల్ లోని 34 ప్లాట్లను వేలానికి పెట్టింది హెచ్ఎండీఏ. బహదూర్ పల్లిలో గజానికి రూ.25వేలు, తొర్రూర్ లో 20వేల రూపాయలు, తుర్కయాంజల్ లో 40వేల రూపాయలు రేటు నిర్ధారించింది ప్రభుత్వం. అయితే ఇ-వేలంలో ధర మరింత పెరిగే ఛాన్స్ ఉంది. తుర్కయాంజల్ లో కొద్దిగా బిల్డర్లు పోటీ పడే అవకాశం ఉన్నా... బహదూర్ పల్లి, తొర్రూర్ లో ప్రభుత్వం నిర్ధారించిన ధరకకే కొనుగోలు చేసేందుకు ఎవ్వరూ ఆసక్తి చూపట్లేదని తెలుస్తోంది. 
ఇప్పటికే రెండు సార్లు ప్రి బిడ్ ఏర్పాటు చేసినా పబ్లిక్ నుంచి మాత్రం ఆదరణ లేదు. తొర్రూర్, బహదూర్ పల్లిలోని ప్లాట్ల వేలంలో పాల్గొనేందుకు.. ఈనెల 28 వరకు రిజిస్ట్రేషన్ గడువు ఉంది. తుర్కయాంజల్ వేలంలో పాల్గొనేందుకు ఈ నెల 27వరకే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. తుర్కయాంజల్ లో ఈనెల 30 ఆన్ లైన్ వేలం నిర్వహించనున్నారు. తొర్రూర్, బహదూర్ పల్లిలో వచ్చే నెల 1, 2, 4 తేదీల్లో ఈ-వేలం జరగనుంది. ఐతే ప్రి బిడ్ కు అనుకున్నంత ఆదరణ లేకపోవడంతో.. తుర్కయంజాల్ తప్ప.. మిగిలిన రెండుచోట్ల ప్లాట్లు అమ్ముడు పోతయా లేదా అనే డైలమాలో పడ్డారు అధికారులు.