
మక్తల్, మక్తల్ టౌన్, వెలుగు: అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భార్యను చంపిండో భర్త. మృతురాలి సోదరుడి వివరాల ప్రకారం.. మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని దండు గ్రామానికి చెందిన వెంకటమ్మ అలియాస్ పావని (23)కి , మక్తల్ మండలం మంతన్ గౌడ్ గ్రామానికి చెందిన నర్సిములుతో 16 నెలల క్రితం వివాహం జరిగింది. వీరికి తొమ్మిది నెలల పాప కూడా ఉంది. నర్సిములు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో తరచూ భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయమై కొన్ని నెలల క్రితం కుటుంబ సభ్యులు పంచాయితీ పెట్టి ఇద్దరికీ సర్దిచెప్పారు. అయినా అతను తీరు మార్చుకోకపోవడంతో మృతురాలు పావని తల్లిగారి ఇంటికి వచ్చింది. పుట్టింటి వాళ్లు ఆమెకు నచ్చజెప్పి 15 రోజుల అత్తగారించటికి పంపించారు. సోమవారం రాత్రి భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవ జరిగింది. మంగళవారం తెల్లవారుజామున పావని అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించింది. దీంతో భర్తే గొంతు నులిమి చంపాడని మృతురాలి తల్లి అనంతమ్మ, సోదరుడు ఆంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై రాములును వివరణ కోరగా.. డెడ్‌బాడీకి పోస్టు మార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించామని, రిపోర్టు వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.