V6 News

373 కాలనీలకు బస్సులు.. 'హైదరాబాద్ కనెక్ట్' పేరుతో ఆర్టీసీ సరికొత్త ప్లాన్ ఈ నెల నుంచే సేవలు

373 కాలనీలకు బస్సులు..  'హైదరాబాద్ కనెక్ట్' పేరుతో ఆర్టీసీ సరికొత్త ప్లాన్   ఈ నెల నుంచే సేవలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలో వేగంగా విస్తరిస్తున్న ప్రాంతాలు, కొత్త కాలనీల వాసులకు మెరుగైన రవాణా సేవలు అందించేందుకు ఆర్టీసీ సరికొత్త కార్యచరణను ప్రకటించింది. ‘హైదరాబాద్ కనెక్ట్’ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా జీహెచ్ఎంసీ పరిధిలోని 373 కొత్త కాలనీలకు బస్సు సౌకర్యం కల్పించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల నుంచే ఈ బస్సులు రోడ్డెక్కనున్నట్టు అధికారులు తెలిపారు. సంస్థ ఎండీ వై. నాగిరెడ్డి అధ్యక్షతన ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నగర శివారుల్లోని 30 సర్కిళ్లు, 150 వార్డుల పరిధిలోని ప్రాంతాల్లో పర్యటించిన అధికారులు ప్రజల రవాణా అవసరాలను గుర్తించారు. ఈ కొత్త సేవల ద్వారా ఆయా కాలనీల్లోని సుమారు 7,61,200 మందికి లబ్ధి చేకూరనున్నది. 

ముఖ్యంగా ఉద్యోగులు, సాఫ్ట్​వేర్​ఎంప్లాయిస్ సౌకర్యార్థం హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఉప్పల్, తదితర ఎంప్లాయిమెంట్ హబ్స్ కాలనీల నుంచి నేరుగా బస్సులను నడపనున్నారు. హైదరాబాద్ కనెక్ట్ కార్యక్రమాన్ని మూడు దశల్లో అమలు చేయనున్నారు. వచ్చే రెండు నెలల్లో అత్యధిక రద్దీ ఉన్న కాలనీల్లో మొదటి దశ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ కొత్త కాలనీల బస్సుల రాకపోకల వివరాలను రియల్ టైమ్​లో ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ‘టీజీఎస్ఆర్టీసీ గమ్యం’ యాప్ ను వినియోగించుకోవచ్చని అధికారులు సూచించారు. ఈ బస్సుల్లో డిజిటల్ పేమెంట్స్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. మొత్తం 373 కాలనీలకు హైదరాబాద్ రీజియన్​లో 243, సికింద్రాబాద్ రీజియన్​లో 130 కాలనీలను ఎంపిక చేశారు. 

హైదరాబాద్ రీజియన్ 

(డిపోల వారీగా)

దిల్ సుఖ్​నగర్    :     55 కాలనీలు 

రాజేంద్రనగర్    :     51 కాలనీలు

మిధాని    :     42 కాలనీలు

బండ్లగూడ    :     34 కాలనీలు

మెహదీపట్నం    :    17 కాలనీలు

ఇబ్రహీంపట్నం    :     14 కాలనీలు

హయత్​నగర్​-1    :     12 కాలనీలు

హయత్​నగర్​-2    :    10 కాలనీలు

ఫలక్ నుమా    :     7 కాలనీలు

మహేశ్వరం    :     1 కాలనీ

సికింద్రాబాద్ రీజియన్ 

జీడిమెట్ల        : 36 కాలనీలు

 చెంగిచెర్ల        : 25 కాలనీలు

కూకట్​పల్లి        : 21 కాలనీలు

మేడ్చల్        : 10 కాలనీలు

ఉప్పల్        : 10 కాలనీలు

హెచ్ పీయూ    :  8 కాలనీలు

మియాపూర్-2    : 7 కాలనీలు

కంటోన్మెంట్    : 6 కాలనీలు

 రాణిగంజ్        : 4 కాలనీలు

కుషాయిగూడ    : 3 కాలనీలు