బెంగళూరులో రూ.7.1 కోట్ల దోపిడీ.. హైదరాబాద్లో పట్టుబడ్డ నిందితులు

బెంగళూరులో రూ.7.1 కోట్ల దోపిడీ.. హైదరాబాద్లో పట్టుబడ్డ నిందితులు

బషీర్​బాగ్, వెలుగు: బెంగళూరులో ఏటీఎంలకు డబ్బును సరఫరా చేసే సీఎంఎస్ కంపెనీ వ్యాన్​ను అడ్డగించి రూ.7.1 కోట్లు దోచుకెళ్లిన కేసులో కీలక ముఠా సభ్యులు హైదరాబాద్​లో పట్టుబడ్డారు. సిటీ పోలీసుల సహకారంతో శనివారం బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌‌ (సీసీబీ) అధికారులు నాంపల్లిలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.53 లక్షలు రికవరీ చేశారు. సీఎంఎస్ మాజీ ఉద్యోగి ఎగ్జావియర్, బెంగళూరులోని గోవిందాపురం పోలీస్‌‌ స్టేషన్​లో కానిస్టేబుల్‌‌గా ఉన్న ఆనందప్ప నాయక్ ఈ దొంగతానికి కుట్ర చేయగా,  గోపాల్ ప్రసాద్ సహా నవీన్, నెల్సన్, రవి ప్రత్యక్షంగా పాల్గొన్నారు.

గత బుధవారం పోలీసులు ముసుగులో డెయిరీ సర్కిల్ ఫ్లైఓవర్ వద్ద వ్యాన్​ను అడ్డగించి నగదు ఎత్తుకెళ్లినట్లు విచారణలో బయటపడింది. ఎగ్జావియర్, ఆనందప్పను శుక్రవారం సీసీబీ అరెస్ట్ చేయగా, వారి సమాచారంతో మిగిలిన ముగ్గురు కారులో హైదరాబాదు కు చేరుకున్నట్లు తెలిసింది. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా వారి కదలికలను గుర్తించారు. నాంపల్లి ప్రాంతంలో సాగించిన గాలింపులో వీరు నాంపల్లి రైల్వేస్టేషన్ నుంచి రైలులో ముంబైకి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు పట్టుకున్నారు. అరెస్టైన ముగ్గురిని రూ.53 లక్షలతో కలిసి బెంగళూరు సీసీబీ తరలించారు. ఈ కేసులో మరో నిందితుడు గోపాల్ ప్రసాద్ కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.