హైదరాబాద్ సిటీ, వెలుగు: రెండో విడతలో 14 చెరువుల అభివృద్ధికి హైడ్రా కసరత్తు ప్రారంభించింది. తొలి విడతలో రూ.58.50 కోట్లతో ఆరు చెరువుల పనులు చేపట్టి, వాటిలో రెండింటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. రెండో విడత పనులకు రూ.303.03 కోట్ల పరిపాలనా అనుమతిని రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్ 30న మంజూరు చేసింది. చెరువుల్లోకి మురుగునీరు చేరకుండా డైవర్షన్ వ్యవస్థలు ఏర్పాటు చేయడంతో పాటు వాకింగ్ ట్రాక్‌లు, పచ్చదనం అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించనున్నారు. పనులు వచ్చేనెల ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
అభివృద్ధి చేయనున్న చెరువులు..
ఖాజాగూడ తౌటోనికుంట(రూ.6.80 కోట్లు), పాపలగూడ భగీరథమ్మ చెరువు(రూ.22 కోట్లు), మదీనగూడ ఏర్ల చెరువు(రూ.17 కోట్లు), బాచుపల్లి ఎర్రకుంట(రూ.6 కోట్లు), రామాంతపూర్ చెరువు(రూ.19 కోట్లు), సాహెబ్‌నగర్ కాప్రా చెరువు(రూ.35 కోట్లు), నల్లగండ్ల చెరువు(రూ.28 కోట్లు), గంగారం పెద్ద చెరువు(రూ.30 కోట్లు), మూసాపేట్ కాముని చెరువు(రూ.21 కోట్లు), కూకట్‌పల్లి రంగధాముని కుంట–ఐడీఎల్(రూ.28 కోట్లు), ఇబ్రహీంబాగ్ పెద్ద చెరువు(రూ.29 కోట్లు), నాచారం చెరువు(రూ.30.50 కోట్లు), జూబ్లీహిల్స్ కృష్ణకాంత్ పార్క్ చెరువు(రూ.7.50 కోట్లు), నిజాంపేట్ తుర్క చెరువు(రూ.23.50 కోట్లు)ను రెండో విడతలో డెవలప్ చేయనున్నారు.
