ఆస్తులమ్ముకున్నా ఫర్వాలేదు గానీ.. కేసీఆర్‎తో కొట్లాడమని నా భార్య చెప్పింది

ఆస్తులమ్ముకున్నా ఫర్వాలేదు గానీ.. కేసీఆర్‎తో కొట్లాడమని నా భార్య చెప్పింది

నాలుగున్నర నెలలుగా నాలాంటి బక్కపల్చటి బిడ్డమీద ఇంతమంది మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కుట్రలుచేస్తున్నారని అన్నారు మాజీ మంత్ర ఈటల రాజేందర్. తన అల్లుడు హరీశ్ రావును హుజురాబాద్ లో పెట్టి.. ప్రగతి భవన్ నుంచి కేసీఆర్ కుట్రలు చేస్తున్నాడని విమర్శించారు. హనుమకొండ కమలాపూర్ మండలంలో జరిగిన పెరిక కుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఈటల..మాట్లాడారు.

నా గొంతు నొక్కాలని, నా ముఖం అసెంబ్లీలో కనిపించకూడదన్న కుతంత్రాలు చేస్తున్నారని తెలిపారు. పీడిత ప్రజల పక్షాన వినిపించే నా గొంతు మూగపోవాలన్న నీచమైన కుట్రలో భాగంగా హరీశ్ రావు, ఎమ్మెల్యే ధర్మారెడ్డి లాంటి వాళ్లంతా ఇక్కడ వాటిని అమలు చేస్తున్నారన్నారు.నేను భయపడేవాన్ని కాదు... ఆకారంలో చిన్నోన్ని కావచ్చు.. కానీ నా గుండె ధైర్యం,నిబ్బరం పెద్దది అని అన్నారు. అందరినీ ఖతం చేసినట్లే నన్ను కూడా ఖతం చేస్తే మరో 20 ఏళ్లు తనకు ఎదురు ఉండదని కేసీఆర్ అనుకుంటున్నాడని అన్నారు. నన్ను  గడ్డిపోచలాగా పీకేస్తామని అనుకున్నారు.. కానీ నేను గడ్డపారలాగా నిలబడ్డాను అని అన్నారు. లారీల్లో లిక్కరు బాటిళ్లు, ఆహారం తెచ్చి ఊర్లను ఊర్లు బార్లుగా మార్చారన్నారు. తెలంగాణలో దసరా రెండు రోజులొస్తే.. హుజురాబాద్ లో మాత్రం మూడు నెలలుగా దసరా నడుస్తోందన్నారు. ఇక్కడి యువకులకు మద్యం తాగించడం అలవాటు చేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేల తీరు చూసి హుజురాబాద్ ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారని తెలిపారు. 

మా దగ్గరున్న సర్పంచులకు బిల్లులు రిలీజ్ చేసినట్లుగా.. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అందరి సర్పంచుల బిల్లులు రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు ఈటల రాజేందర్. ఓట్ల  కోసమే హుజురాబాద్ సర్పంచులకు రావాల్సిన బిల్లులు మంజూరు చేస్తున్నారని చెప్పారు. నా సహచరుడు హరీశ్ రావు రాత్రి పూట పల్లెల్లో అడ్డాలు పెట్టి.. నాతో తిరిగేవాళ్లను కలిసి టీఆర్ఎస్ లోకి రావాలని ప్రలోభపెడుతూ.. బేరాలాడుతున్నాడని అన్నారు. హరీశ్ ఒకప్పుడు మాట్లాడితే తెలంగాణ పులకించిపోయేది... ఆయన ఇప్పుడు ఎంతకు దిగజారాడో చూస్తున్నారు అని అన్నారు. కేసీఆర్ పంపిస్తే.. తన ఉద్యమ సహచరున్నైన నన్ను బొందపెట్టాలని హరీశ్ చూస్తున్నాడని చెప్పారు. 
వాళ్లు పంచుతున్న డబ్బుల వెనక, ఇస్తున్న పథకాల జీవో వెనక మీ మీద ప్రేమలేదు.. కేవలం ఓట్లు పొందాలనే కుట్ర ఉందని తెలిపారు ఈటల. నిన్నటి వరకు నాతో కలిసి తిరిగినోడు, కలిసి తిన్నోడు.. తెల్లారితే వాళ్ల దగ్గరికి పోతున్నారు. నాతో తిరగడం వల్లే నాయకుల ధర పెరుగుతోందని.. ధర చెల్లించి వాళ్లను కొనుక్కుపోతున్నారన్నారు. హుజురాబాద్ లో 200 కోట్లు ఖర్చు చేసే శక్తి మీకు ఎలా వచ్చింది. మీది అక్రమ సంపాదన కాదా అని తెలంగాణ సమాజం మిమ్మల్ని అడగబోతోందని అన్నారు. అంతేకాదు ఖచ్చితంగా ఈ సమాజం.. కేసీఆర్ ను బోనులో నిలబెట్టితీరుతుందని.. ఈ ఉచ్చునుంచి తప్పించుకోలేరన్నారు. 

దళిత కుటుంబాలకు నా వల్ల పది లక్షలు వస్తున్నందుకు సంతోషిస్తున్నానని అన్నారు ఈటల.రైతులందరికీ త్వరలో నావల్లే రుణమాఫీ కాబోతోంది... నేను కూడా మీ రుణం తీర్చుకుంటున్నట్లే భావిస్తున్నా అని తెలిపారు.ఇలాంటి అవకాశాలు సిద్ధిపేటకు, సిరిసిల్లకు, గజ్వేలుకు కూడా రావు.. మనకు మాత్రమే వస్తున్నాయన్నారు. ఇలాంటి కుట్రలను చేధించి  రాజకీయంగా నన్ను సాదుకుంటరా.. చంపకుంటరా?  మీ చేతుల్లో ఉందన్నారు. 

కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు గెలిచినట్లుగా.. హుజురాబాద్ లో ధర్మమే గెలుస్తుందన్నారు ఈటల రాజేందర్. భీష్ముడు, ద్రోణాచార్యుడు లాంటి వాళ్లంతా కౌరవుల వెంటే ఉన్నా... ధర్మం వైపున్న పంచ పాండవులే గెలిచారన్నారు. ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ అహంకారాన్ని బొంద పెడుతానని అన్నారు. 2023 ఎన్నికలకు హుజురాబాద్ ఎన్నికలు రిహార్సల్ కాబోతున్నాయని.. ఇంత చారిత్రక బాధ్యత మీ చేతుల్లో ఉంది.. చిన్న చిన్న వాటికి ఆగం కాకుండా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని కోరారు ఈటల.