ODI World Cup 2023: జద్రాన్ సెంచరీ వెనుక సచిన్.. అసలు నిజాన్ని చెప్పేసిన ఆఫ్ఘనిస్థాన్ ఓపెనర్

ODI World Cup 2023: జద్రాన్ సెంచరీ వెనుక సచిన్.. అసలు నిజాన్ని చెప్పేసిన ఆఫ్ఘనిస్థాన్ ఓపెనర్

వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ రికార్డ్ సెంచరీ కొట్టేసాడు. 130 బంతుల్లో సెంచరీ చేసిన ఈ స్టార్ ఓపెనర్.. 143 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సులతో 129 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఓపెనర్ గా దిగి 50 ఓవర్ల వరకు అవుట్ కాకుండా క్రీజ్ లోనే ఉన్నాడు. పటిష్టమైన ఆసీస్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ జద్రాన్ ఆడిన ఇన్నింగ్స్ క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటుంది.ఆఫ్ఘనిస్థాన్ వరల్డ్ కప్ చరిత్రలో ఒక బ్యాటర్ సెంచరీ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇంత గొప్ప ఇన్నింగ్స్ ఆడిన జద్రాన్ ఈ సెంచరీకు అసలు కారణం సచిన్ టెండూల్కర్ అని చెప్పుకొచ్చాడు. 

ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన జద్రాన్ " నిన్న రాత్రి సచిన్ ను కలిసాను. అతని సలహాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. అతను అనుభవం నాతో షేర్ చేసుకోవం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఈ సెంచరీకు కారణం సచినే. ఇన్నింగ్స్ ఆసాంతం సచిన్ లా ఆడాలనుకున్నా". అని ఈ ఆఫ్ఘన్ ఓపెనర్ సంతోషం వ్యక్తం చేసాడు. ప్రస్తుతం వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా-ఆఫ్ఘనిస్థాన్ మధ్య ముంబై వేదికగా మ్యాచ్ జరుగుతుంది. సచిన్ ది కూడా ముంబై కావడంతో ఈ గ్రౌండ్ లో కలిసి ఆఫ్ఘనిస్థాన్ ప్లేయర్లకు కొన్ని సలహాలు ఇచ్చాడు.
 
జద్రాన్ సెంచరీతో నిర్ణీత 50 ఓవర్లలో ఆఫ్ఘనిస్థాన్ 5 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. రషీద్ ఖాన్(35) రహ్మత్ షా (30) రాణించారు. లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 61 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆఫ్ఘన్ పేసర్లు నవీన్ ఉల్ హక్, ఓమార్జాయి చెలరేగడంతో ఆ జట్టు గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. వార్నర్, హెడ్, మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లిస్ తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజ్ లో లబుషేన్(13) మ్యాక్స్ వెల్ (4) క్రీజ్ లో ఉన్నారు.