నా అరెస్ట్​లో రాజ్​భవన్​ పాత్ర

నా అరెస్ట్​లో రాజ్​భవన్​ పాత్ర
  • అవినీతి ఆరోపణలు నిరూపిస్తే  పాలిటిక్స్​ వదిలేస్తా: హేమంత్​ సోరెన్​

రాంచీ: నిరాధార ఆరోపణలతో బదనాం చేయడం కాదు.. వాటిని రుజువు చేయాలని జార్ఖండ్​ మాజీ సీఎం హేమంత్​ సోరెన్ బీజేపీకి సవాల్​ విసిరారు. తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తాను తప్పుకుంటానని చెప్పారు. ఈడీ కస్టడీలో ఉన్న ఆయనను విశ్వాస పరీక్షలో పాల్గొనడానికి పీఎంఎల్​ఏ స్పెషల్​ కోర్టు అనుమతించింది. దీంతో సోమవారం విశ్వాస పరీక్షలో పాల్గొన్న సోరెన్.. అనంతరం ఉద్వేగంగా మాట్లాడారు. తన అరెస్టు వెనక కేంద్రం కుట్ర ఉందని, ఈ కుట్రలో రాజ్ భవన్​కూ పాత్ర ఉందని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. ‘భారతదేశ చరిత్రలో జనవరి 31 ఒక చీకటి అధ్యాయం. రాజ్‌‌‌‌భవన్‌‌‌‌లో ఒక సీఎంను అరెస్టు చేశారు.

జార్ఖండ్‌‌‌‌లో ఒక గిరిజన సీఎం ఐదేండ్లు పాలన పూర్తిచేయడం బీజేపీకి ఇష్టం లేదు’ అని సోరెన్ తీవ్రంగా స్పందించారు. గిరిజనేతర బీజేపీ నేత రఘుబర్ దాస్ మినహా, జేఎంఎంకు చెందిన ఇతర10 మంది గత సీఎంలలో ఎవరూ ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేయలేకపోయారని గుర్తు చేశారు. తాను ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకోబోవడంలేదని, ఈ ఫ్యూడల్​శక్తులకు తగిన సమయంలో తగిన సమాధానం ఇస్తానని అన్నారు. గిరిజనులను  అంటరానివారుగా బీజేపీ పరిగణిస్తోందని హేమంత్​ ఆరోపించారు. ‘నేను మరింత బలంతో తిరిగి వస్తాను. ప్రతిపక్షాల కుట్రను తిప్పికొడతాను’ అని సోరెన్ హెచ్చరించారు. జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా దేశంలో రామరాజ్యాన్ని తీసుకువస్తామని బీజేపీ చెప్పిందని, కానీ మొదట బీహార్‌‌‌‌లో ప్రభుత్వాన్ని అస్థిరపరిచి, ఆ తర్వాత జార్ఖండ్‌‌‌‌లో అలాంటి చర్యలకే పాల్పడే ప్రయత్నం చేసిందని ఆయన మండిపడ్డారు.

  • రాష్ట్రపతి పాలన వ్యూహాన్ని తిప్పికొట్టి

జార్ఖండ్​లో రాష్ట్రపతి పాలన విధించాలనే వ్యూహాన్ని మాజీ సీఎం వ్యూహాత్మకంగా తిప్పికొట్టినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విచారణ తర్వాత అరెస్టు చేస్తున్నట్లు తెలపగా.. సీఎం పదవికి రాజీనామా చేశాకే అరెస్టు మెమోపై సంతకం పెడతానని హేమంత్​ సోరెన్ పట్టుబట్టినట్లు ఈడీ అధికారులు చెప్పిన విషయం తెలిసిందే. దీనికి కారణం.. పదవిలో ఉండగా తనను అరెస్టు చేస్తే రాజకీయ అస్థిరత ఏర్పడుతుందని, దీంతో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందన్న ముందుచూపుతో హేమంత్​ వ్యవహరించారని చెప్పారు.

చివరకు ఈడీ అధికారులు హేమంత్​ను రాజ్ భవన్​కు తీసుకెళ్లారు. గవర్నర్​కు ఆయన రాజీనామా పత్రం అందించి, ఆమోదింపజేసుకున్నాక అరెస్టు చేశారు. ఈలోగా ముందే సిద్ధం చేసిపెట్టుకున్న ఎమ్మెల్యేల మద్దతు పత్రంతో చంపయీ సోరెన్ గవర్నర్​ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు తనకుందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరడం జరిగిపోయాయి. తన అరెస్టును ముందే ఊహించి హేమంత్ సోరెన్.. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు కూడా చేసుకోవడం గమనార్హం.