హైదరాబాద్, వెలుగు: కీసరలో వెలుగుచూసిన మేకలు, గొర్రెల రక్తం దందాలో తీగ లాగితే కాచిగూడలోని ల్యాబ్లో డొంక కదిలింది. బతికున్న జీవాల నుంచి అమానుషంగా రక్తాన్ని పిండేసి అమ్ముతున్న కేసులో ఆ రక్తాన్ని కొనుగోలు చేస్తున్నది కాచిగూడలోని ల్యాబ్ నిర్వాహకులేనని తేలడంతో అధికారులు మంగళవారం దాడులు చేశారు.
రెండు రోజుల కింద కీసర మండలం నాగారంలో సోనూ మటన్ షాపులో గొర్రెల రక్తాన్ని అక్రమంగా సేకరిస్తుండడంతో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి సమాచారంతో మంగళవారం కాచిగూడ బద్రుక కాలేజీ సమీపంలోని సీఎన్కే ల్యాబ్స్‌పై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు, ఈస్ట్ జోన్ పోలీసులు, క్లూస్ టీమ్ సంయుక్తంగా దాడులు నిర్వహించారు.
ల్యాబ్లో సిబ్బందిని ప్రశ్నించి మేకలు, గొర్రెల రక్తం నిల్వలు, కొనుగోలు పత్రాలు, ఇతర రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ దందాలో కీలక సూత్రధారిగా భావిస్తున్న సీఎన్కే ల్యాబ్ ఓనర్ నికేశ్ రెండు రోజుల ముందే పారిపోగా, అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నికేశ్ దొరికితే ఈ దందాలో ఇంకా ఎవరెవరున్నారనేది బయటపడే అవకాశం ఉంది.
