తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

శని, ఆది వారాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు మధ్య, ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిస్తాయని అధికారులు తెలిపారు. వాతావరణశాఖ హెచ్చరికతో ఒడిశా ప్రభుత్వం రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా కేరళ ప్రభుత్వం కూడా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కేరళలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు.

అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలో ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం రాత్రి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలోని పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. రాత్రి నుంచి పడుతున్న వర్షాలతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పత్తి, వరి దెబ్బతినే అవకాశం ఉందంటున్నారు. హైదరాబాద్ సిటీలో శనివారం ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. అటు ఏపీలోని ఉత్తర కోస్తాంధ్రలో చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఒడిశాలోని గజపతి, గంజాం, రాయగడ్, కోరాపుట్ మరియు మల్కాన్ గిరి జిల్లాల్లో నేడు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశముంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో అక్టోబర్ 19 వరకు ఒడిశాలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవవచ్చని ఐఎండీ అధికారులు హెచ్చరించారు.