- బస్సు చార్జీల పెంపా.. ప్రభుత్వం నుంచి ప్యాకేజీనా?
- బస్ భవన్లో ఆర్టీసీ ఉన్నతాధికారుల భేటీ
- పెరిగిన డీజిల్ రేట్లతో సంస్థపై ప్రతినెలా 10 కోట్లకు పైగా భారం
- బస్సు చార్జీల పెంపా.. ప్రభుత్వం నుంచి ప్యాకేజీనా? అనే దానిపై సుదీర్ఘ చర్చ
- రెండు అంశాలపై ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: పెరుగుతున్న డీజిల్ ధరల నేపథ్యంలో ఆర్టీసీని గట్టెక్కించేందుకు బస్సు చార్జీలు పెంచడం లేదా ప్రభుత్వాన్ని ఆర్థిక సహాయం కోరడం.. ఈ రెండే మార్గాలని సంస్థ యాజమాన్యం భావిస్తోంది. రెండు అంశాలపై ప్రభుత్వానికి నివేదిక అందించాలని అధికారులు నిర్ణయించారు. ప్రభుత్వ స్పందన తర్వాత చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు బస్‌భవన్‌లో సంస్థ ఎండీ నాగిరెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. దీనికి ఈడీలు, అన్ని విభాగాల హెచ్‌ఓడీలు హాజరయ్యారు. డీజిల్ ధరలు పెరగడంతో లీటర్‌కు రూ.8 వరకు పెరిగిన భారం ఆర్టీసీపై తీవ్ర ప్రభావం పడుతుండగా.. ఈ పరిస్థితుల్లో సంస్థను ఆర్థికంగా ఎలా గట్టెక్కించాలన్న దానిపైనే అధికారులు విస్తృతంగా చర్చించారు.
- రోజుకు 33.63 లక్షల భారం
ప్రస్తుతం పెరిగిన డీజిల్ ధరల కారణంగా ఆర్టీసీకి ప్రతి రోజు రూ.33.63 లక్షల అదనపు భారం పడుతోంది. ఈ లెక్కన నెలకు రూ.10.24 కోట్ల వరకు అదనపు ఖర్చు భరించాల్సి వస్తోంది. మరోవైపు సమ్మె విరమణ సందర్భంగా కార్మికులకు 11 శాతం ఫిట్‌మెంట్, 2021 వేతన సవరణ అమలు వంటి నిర్ణయాలతో సంస్థపై మరింత ఆర్థిక భారం పడింది. ఈ నేపథ్యంలో డీజిల్ ధరల పెంపు ఆర్టీసీని ఆర్థిక ఒత్తిడిలోకి నెట్టిందని అధికారులు అభిప్రాయపడ్డారు.
భవిష్యత్‌లో ధరలు ఎంతవరకు పెరుగుతాయన్న దానిపై సమగ్ర అధ్యయనం తర్వాతే బస్సు చార్జీల పెంపుపై తుది నిర్ణయం తీసుకోవాలని అధికారులు భావించినట్టు సమాచారం. అందువల్ల తక్షణం చార్జీలు పెంచవద్దన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. సంస్థను ఆర్థికంగా ఆదుకునేందుకు మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ఇస్తున్న మొత్తాన్ని పెంచాలని కోరాలని, అలాగే, షరతులు లేకుండా ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించాలని అధికారులు నిర్ణయించారు.
- కార్మికుల సమ్మె విరమణ హామీలపై చర్చ..
సమ్మె సందర్భంగా జేఏసీ నేతలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేసే అంశంపై కూడా సమావేశంలో చర్చించారు. 11 శాతం ఫిట్‌మెంట్, 2021 వేతన సవరణ అమలు వల్ల సంస్థపై పడుతున్న అదనపు భారాన్ని సమీక్షించారు. కార్మికులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడం, రిటైర్డ్ ఉద్యోగులకు పెండింగ్ చెల్లింపులను త్వరగా పూర్తి చేయడం వంటి అంశాలపై కూడా చర్చ జరిగింది.
ప్రస్తుత పరిస్థితుల్లో సంస్థ ఆదాయాన్ని పెంచుకునే మార్గాలపై అధికారులు దృష్టి సారించారు. ముఖ్యంగా ఆక్యుపెన్సీ రేషియో పెంచడం ద్వారా ఆదాయం పెంచాలని నిర్ణయించారు. నష్టాల్లో ఉన్న డిపోలను ఆర్‌ఎంలు తరచూ సందర్శించి, సాధ్యమైనంత త్వరగా ఆదాయ మార్గాలను పెంచే చర్యలు చేపట్టాలని సూచించారు.
- చర్చకు రాని విలీనం, యూనియన్‌ల ఏర్పాటు
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, యూనియన్ ఎన్నికలు నిర్వహించడం వంటి అంశాలు ప్రభుత్వ పరిధిలో ఉన్నందున వాటిపై సమావేశంలో ఎలాంటి చర్చ జరగలేదు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలను పాటించాలని అధికారులు నిర్ణయించారు. మారిన పరిస్థితుల్లో డిపోలు, బస్ స్టేషన్లలో పనిచేసే అధికారులు యూనియన్ నేతలు తీసుకొచ్చే సమస్యలపై వెంటనే స్పందించాలని, వారికి తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వాలని నిర్ణయించారు.
