ప్రముఖ యూట్యూబర్ అండ్ ఫౌండర్ సలోని శ్రీవాస్తవ ఇండియాలో చాల మందికి అలవాటైన బ్లింకిట్, జెప్టో 10 నిమిషాల డెలివరీ గురించి ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు. ఆమె ఫ్రాన్స్‌కు వెళ్లిన తర్వాత గత ఐదు నెలలుగా ఈ యాప్స్ లేకుండా గడిపిన తన అనుభవాన్ని వివరించారు.
నేను భారతదేశంలో ఉన్నప్పుడు ఏదైనా వస్తువు వెంటనే కావాలంటే నిమిషాల్లో డెలివరీ వచ్చేది. దీనివల్ల మనకు ముందే ఆలోచించి ప్లాన్ చేసుకునే అలవాటు పోయిందని ఆమె అన్నారు. ఫ్రాన్స్‌లో ఆదివారం షాప్స్/స్టోర్స్ మూసివేస్తారు, కాబట్టి అక్కడ వారానికి సరిపడా వస్తువులను ముందే లిస్ట్ రాసుకుని తెచ్చుకోవాలి. ఇది మొదట్లో కష్టంగా అనిపించినా, జీవితం నెమ్మదిగా ప్రశాంతంగా సాగుతోందని తెలిపారు.
కేవలం 10 నిమిషాల్లో మన కోరికలను/ఇష్టాలను తీర్చడానికి డెలివరీ బాయ్స్ ఎంత రిస్క్ చేస్తున్నారో మనం గమనించడం లేదని సలోని పేర్కొన్నారు. మన చిన్న కోరికల కోసం వారు ట్రాఫిక్, కాలుష్యం, ప్రమాదకరమైన రోడ్లపై ప్రాణాలకు తెగించి పరిగెడుతున్నారు. మనం కొంచెం ముందుగా ప్లాన్ చేసుకుంటే, వారిపై ఈ ఒత్తిడి తగ్గుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
సిటీ నగరాల్లో రోడ్లు సరిగా లేకపోవడం, ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల మనం బయటకు వెళ్లలేక ఈ యాప్‌లపై ఆధారపడుతున్నామని ఆమె అన్నారు. ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలం కావడం వల్లే, లక్షలాది మంది యువకులు తక్కువ జీతానికి ఈ కష్టమైన డెలివరీ పనుల్లో చేరుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
నిజానికి 10 నిమిషాల్లో మన దగ్గరకు రావాల్సింది కేవలం అంబులెన్స్ లేదా పోలీస్ మాత్రమే అని ఆమె గుర్తు చేశారు. సౌలభ్యం పేరుతో మనం ఇతరుల కష్టాన్ని దోచుకుంటున్నామా.... అని సలోని ప్రశ్నించారు. ఈ 'క్విక్ కామర్స్' యాప్‌లు లేకుండా కూడా మనం హాయిగా జీవించగలమని ఆమె తన అనుభవం ద్వారా నిరూపించారు.
