వరంగల్ లో నామమాత్రంగా డ్రగ్ ఇన్స్ పెక్టర్ల తనిఖీలు

వరంగల్ లో నామమాత్రంగా డ్రగ్ ఇన్స్ పెక్టర్ల తనిఖీలు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో డ్రగ్ ఇన్స్ పెక్టర్ల తనిఖీలు నామమాత్రంగా ఉన్నాయి. 5 జిల్లాలకు కలిపి ఇద్దరు మాత్రమే డ్రగ్ ఇన్స్ పెక్టర్లు ఉండటంతో.. మెడికల్ షాపుల్లో తనిఖీలు చేసేవారు లేరు. దీంతో.. మెడిసిన్ ఒక్కో షాపులో ఒక్కోరేటుకు అమ్ముతున్నారని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్  జిల్లా వ్యాప్తంగా 1,622 మెడికల్  షాపులు, 390 మెడికల్ ఏజెన్సీలు ఉన్నట్లుగా డ్రగ్స్ ఇన్స్ పెక్టర్ల రికార్డులను బట్టి తెలుస్తోంది. ప్రైవేటు నర్సింగ్ హోమ్స్, హాస్పిటల్స్ లో అన్నీ కలిపి 2వేలకు పైగా మెడికల్ షాపులున్నట్లు తెలుస్తోంది. మెడికల్ షాపుల తనఖీలకు ప్రతీ జిల్లాలో ఒక డ్రగ్ ఇన్స్ పెక్టర్ ను నియమించింది ప్రభుత్వం. కానీ ఇక్కడ పని చేసిన డ్రగ్స్ ఇన్స్ పెక్టర్లు బదిలీ అయ్యారు. దీంతో ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, ములుగు జిల్లాలకు ఒక్క అధికారే విధులు నిర్వహిస్తున్నారు. జనగామ, హన్మకొండ జిల్లాలకు కూడా ఒక్కరే ఉండటంతో మెడికల్ షాపులపై అధికారులు తనఖీలు చేయట్లేదనే విమర్శలొస్తున్నాయి. నకిలీ మందులు, గడువు దాటిన మందులు విక్రయాలు జరిపే మెడికల్ షాపుల యజమాన్యాలపై చర్యలు తీసుకోవాల్సిన డ్రగ్స్ అధికారులు.. బాధ్యత మరిచారని స్థానికులు చెప్తున్నారు.

మెడికల్ షాపుల్లో కొన్ని మెడిసిన్లను కూల్ లో.. మరికొన్ని కోల్డ్ లో ఉండేలా చూడాలి. కానీ కొన్ని మెడికల్ షాపుల్లో ఫార్మసిస్టులులేక, మందులపై పూర్తి అవగాహనలేక... కూల్ లో ఉంచడం లేదని తెలుస్తోంది. దీంతో అవి రోగాల్ని నయం చేయడం లేదని పేషెంట్లు చెబుతున్నారు. అంతేకాదు మెడిసిన్స్ కొంటే బిల్లులు కూడా ఇవ్వడం లేదని.. ఒకే రకం ట్యాబ్లెట్స్.. ఒక్కోషాపులో ఒక్కోరేటుకు అమ్ముతున్నారని చెప్తున్నారు.  మెడిసిన్స్ రేట్ల విషయంలో ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటున్నారు వినియోగదారుల మండలి రాష్ర్ట అధ్యక్షులు సాంబరాజు చక్రపాణి. డ్రగ్స్ ఇన్స్ పెక్టర్లు పర్యవేక్షణ చేయటం లేదంటున్నారు.  మెడికల్ షాపులపై వస్తున్న ఆరోపణలు, అవకతవకలపై హనుమకొండ డ్రగ్స్ ఇన్స్ పెక్టర్ రఫీ స్పందించారు. నిబంధనలు పాటించని మెడికల్ షాపులపై తాము యాక్షన్ తీసుకుంటున్నామని చెప్పారు. బిల్లులు ఇవ్వట్లేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామన్నారు నిబంధనలు పాటించని మెడికల్ షాపులు, ఒకే రకం మందులను వివిధ రేట్లకు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు జనం.