ఇరాన్‌తో ఏకపక్షంగా యుద్ధం మొదలుపెట్టిన అమెరికా.. ఇప్పుడు వార్ ఆపేందుకు తంటాలు పడుతోంది. యుద్ధం ఆపేద్దాం.. కూర్చొని మాట్లాడుకుందామని ఇరాన్‌కు ప్రపోజల్స్ పెడుతోంది అమెరికా. కానీ ఇరాన్ మాత్రం యుద్ధం ఆపే ముచ్చటే లేదంటుంది. ఈ క్రమంలోనే యుద్ధం ముగించేందుకు లేటేస్ట్‌గా అమెరికా ప్రతిపాదించిన 15 డిమాండ్లను కూడా ఇరాన్ నిర్మోహమాటంగా తిరస్కరించింది. అమెరికా ప్రతిపాదనను రిజెక్ట్ చేయడమే కాకుండా ఎటకారంతో ఎగతాళి చేసింది ఇరాన్.
నాలుగు వారాలుగా సాగుతోన్న యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్‌కు 15 సూత్రాల కాల్పుల విరమణ ప్రణాళికను ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించింది. అమెరికా ప్రతిపాదనను ఇరాన్ నిర్ద్వందంగా తిరస్కరించింది. ఇరాన్ సైనికాధికారి లెఫ్టినెంట్ కల్నల్ ఇబ్రహీం జొల్ఫఘారి అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని తోసిపుచ్చారు. ట్రంప్ ప్రభుత్వం కేవలం తమలో తామే చర్చలు జరుపుకుంటోందని ఎద్దేవా చేశారు.
మీకు మీరే చర్చించుకోండి.. మీకు మీరే డిమాండ్లు పెట్టుకోండని ఎటకారం చేశారు. అమెరికా తన సైనిక వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే కాల్పుల విరమణ ఒప్పందం అంటూ డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. ప్రపంచ అగ్రరాజ్యమని చెప్పుకుంటున్న అమెరికా ఓటమిని ఒక ఒప్పందంగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తోందని ఎద్దేవా చేశారు. మీ వైఫల్యాన్ని ఒప్పందం అని పిలవకండని చురకలంటించారు.
ఇరాన్ తన వైఖరిపై ఎప్పటికీ రాజీ పడబోదని తేల్చి చెప్పారు. మొదటి రోజు నుంచి మాది ఒకటే మాట.. ఒకటే విధానం.. ఇందులో ఎలాంటి మార్పు ఉండదని స్పస్టం చేశారు. ఇరాన్ తన సార్వభౌమాధికార విషయంలో ఇప్పుడే కాదు ఎప్పటికీ రాజీ పడదని కుండబద్దలు కొట్టారు. అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణ ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించడంతో ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ప్రపంచ దేశాల్లో ఆసక్తి నెలకొంది.
అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణ ప్రణాళికలో ముఖ్యమైన అంశాలు:
- ఇరాన్ తన ప్రస్తుత అణు సామర్థ్యాలను విచ్ఛిన్నం చేయాలి.
- ఇరాన్ అణ్వాయుధాలను ఎన్నటికీ అభివృద్ధి చేయబోమని హామీ ఇవ్వాలి.
- ఇరాన్ భూభాగంలో యురేనియం సుసంపన్నం చేయడానికి అనుమతి ఉండదు.
- సుమారు 450 కిలోల యురేనియం నిల్వలో 60 శాతాన్ని అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు అప్పగించాలి.
- నతాంజ్, ఇస్ఫహాన్, ఫోర్డోలోని అణు కేంద్రాలను కూల్చివేయాలి.
- IAEAకు ఇరాన్ అంతటా పూర్తి ప్రాప్యత, పారదర్శకత లభించాలి.
- ఇరాన్ తన ప్రాంతీయ ప్రాక్సీ కార్యకలాపాలను నిలిపివేయాలి.
- మిత్రపక్ష మిలీషియాలకు మద్దతు ఆగిపోవాలి.
- హోర్ముజ్ జలసంధి ప్రపంచవ్యాప్త రవాణాకు తెరిచి ఉంచాలి.
- ఇరాన్ క్షిపణి కార్యక్రమాన్ని పరిధి, పరిమాణం పరంగా పరిమితం చేయాలి.
- భవిష్యత్తులో క్షిపణి వినియోగం ఖచ్చితంగా ఆత్మరక్షణకు మాత్రమే పరిమితం కావాలి.
