హైదరాబాద్ లో భారీ వర్షం

హైదరాబాద్ లో  భారీ వర్షం

వచ్చే మూడు రోజులు రాష్ట్రానికి వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ఎల్లుండి కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందన్నారు. రాబోయే మూడు రోజులపాటు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు.

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఇవాళ మధ్యాహ్నం భారీ వర్షం పడింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ కనిపించినప్పటికీ మధ్యాహ్నం 2 గంటల తర్వాత వాతావరణం చల్లబడింది. పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురియగా, మరికొన్ని చోట్ల భారీ వర్షం నమోదైంది. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. బల్దియా పరిధిలోని జీడిమెట్ల, గాజుల రామారంలో గరిష్టంగా 6 సెంటీమీటర్ల  వర్షపాతం నమోదైంది. షాపూర్ నగర్, హఫీజ్ పేట్ లో 6 సెంటీమీటర్లు, కుత్బుల్లాపూర్ లో 5.6 సెంటీమీటర్లు, మల్కాజిగిరిలోని ఈస్ట్ ఆనంద్ బాగ్ లో 5.1 సెంటీమీటర్ల వర్షం పడింది. 

కాప్రాలో 4.4 సెంటీమీటర్లు, మచ్చ బొల్లారంలో 4 సెంటీమీటర్లు, లింగోజిగూడలో 3.9 సెంటీమీటర్లు, బంజారాహిల్స్ , ఫతేనగర్ లలో 3.6 సెంటీమీటర్లు, బాలానగర్ లో 3.4 సెంటీమీటర్లు, అమీర్ పేట్ లో 3.3 సెంటీమీటర్లు, శ్రీనగర్ కాలనీ, ఖైరతాబాద్ లలో 2.8 సెంటీమీటర్లు, తిరుమలగిరి ,ఆసిఫ్ నగర్, మూసాపేట్ లలో 2.7 సెంటీమీటర్లు, మౌలాలిలో 2.6 సెంటీమీటర్లు, సరూర్ నగర్ లో 2.1 సెంటీ మీటర్లు, నేరేడ్ మెట్ లో 1.9 సెంటీమీటర్లు, కూకట్ పల్లిలో 1.6 సెంటీమీటర్లు, రామంతపూర్ లో 1.4 సెంటీమీటర్లు, డబీర్ పురాలో 1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. రాజేంద్ర నగర్, ముషీరాబాద్, అంబర్ పేట, ఉప్పల్, చార్మినార్, అల్వాల్ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.