హైదరాబాద్: హుజురాబాద్ ప్రజల తీర్పుతో కేసీఆర్ కు దిమ్మతిరిగిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. కేసీఆర్ సీఎం అయ్యాక ప్రోటోకాల్ ను కాలరాశారని ఫైర్ అయ్యారు. సమైక్య రాష్ట్రంలో ఉన్న స్వేచ్చ కూడా ఇప్పుడు లేకుండా పోయిందని మండిపడ్డారు. కేంద్రం సర్కార్ వడ్లు కొంటుందని చెప్పారు. రైతువేదికలు పశువులు కట్టేసే షెడ్లలా మారాయని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వ్యాట్ ను తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఉద్యమకారుల నోట్లో మట్టి కొట్టి.. ద్రోహులకు పదవులిస్తుండు
కేసీఆర్.. ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. రెండు గంటలు కేసీఆర్ మాట్లాడుతున్నాడంటే ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు. హుజురాబాద్ ప్రజలు ఇచ్చిన తీర్పుకే కేసీఆర్‌కు దిమ్మతిరిగితే.. యావత్ తెలంగాణ ప్రజలు ఇచ్చే తీర్పుకు ఆయన సిద్ధంగా ఉండాలని అన్నారు. నోరు చించుకుని మాట్లాడినంత మాత్రాన కేసీఆర్ తప్పు చేయనట్టు కాదన్నారు. కేసీఆర్ మాటల్లో నిజం లేదని, విశ్వసనీయత లేదని ఈటల చెప్పారు. ఉద్యమకారుల నోట్లో మట్టి కొట్టి.. ఉద్యమ ద్రోహులకు పదవులు కట్టబెడుతున్నాడని, అందుకే ఉద్యమకారులెవరూ కేసీఆర్ వెంట ఉండొద్దని అన్నారు.
అమరులకు నివాళి అర్పించాక ప్రమాణ స్వీకారం
అంతకు ముందు గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు ఈటల రాజేందర్. ఆ తర్వాత ఏడోసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలోని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రమాణం చేశారు. కార్యక్రమంలో ఈటల వెంట పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తుల ఉమ, ఏనుగు రవీందర్ రెడ్డితోపాటు పలువురు బీజేపీ నేతలు ఉన్నారు.