ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య చిచ్చు పెట్టొద్దు

 ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య  చిచ్చు పెట్టొద్దు
  • ప్రతిపక్ష నేతలకు ఉద్యోగ జేఏసీ సూచన
  • ఒక్కో సమస్యను సర్కారు పరిష్కరిస్తోందని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: పదేండ్లుగా పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతున్నాయని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు తెలిపారు. కొంత మంది మాజీ ఉద్యోగ సంఘ నేతలు, ప్రతిపక్ష నేతలతో కలిసి ఉద్యోగ సంఘాలకు, ప్రభుత్వానికి మధ్య ఆగాధం, చిచ్చు పెట్టడానికి ఏడాదిన్నరగా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటివి మానుకోవాలని సూచించారు. రాష్ట్రంలో పదేండ్ల తర్వాత ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం గుర్తించిందన్నారు.

 ఉద్యోగుల సమస్యలను చర్చించి, పరిష్కరించేందుకు సీఎస్ చైర్మన్‌‌‌‌‌‌‌‌గా పలు శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, 9 ఉద్యోగ సంఘాల నేతలతో తెలంగాణ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ పునరుద్ధరణ ఇస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వటంపై 205 సంఘాల జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, ఇతర మంత్రులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. గురువారం గన్‌‌‌‌‌‌‌‌పార్క్‌‌‌‌‌‌‌‌లోని అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. 

అనంతరం మారం, ఏలూరి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ముందు ఉంచిన 15 ప్రధాన డిమాండ్లలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అనేది ప్రధాన డిమాండ్ అని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత సంఘాలే ఉండొద్దని, ఉద్యోగ సంఘాల గుర్తింపును గత ప్రభుత్వం రద్దు చేస్తే అప్పటి సంఘ నేతలు పట్టించుకోలేదని వారు గుర్తుచేశారు. ఏడాదిన్నరలో ఉద్యోగ జేఏసీకి సీఎం ఎన్నోసార్లు అపాయింట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఇచ్చి సమావేశాలు నిర్వహించారని కో చైర్మన్ ముజీబ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు సత్యనారాయణ, మదుసూదన్ రెడ్డి, కృష్ణయాదవ్, కస్తూరి వెంకటేశ్వర్లు, సత్యనారాయణ గౌడ్‌‌‌‌‌‌‌‌ ఇతర నేతలు పాల్గొన్నారు