- జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీసీల భవిష్యత్ ఆధారపడి ఉంది: జాజుల శ్రీనివాస్ గౌడ్
- ఈ ఎన్నికలో బీసీలంతా ధర్మం వైపు నిలబడాలని పిలుపు
- నవీన్ యాదవ్కు 130 బీసీ కుల సంఘాలు, 40 బీసీ సంఘాల సంపూర్ణ మద్దతు
హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీసీల భవిష్యత్ ఆధారపడి ఉందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇది ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న ఎన్నిక అని.. బీసీలంతా ధర్మం వైపు నిలబడాలని ఆయన సూచించారు. ఈ ఎన్నికలో బీసీ అభ్యర్థి లక్ష మెజార్టీతో గెలిస్తే 2028లో 60 మంది బీసీలు ఎమ్మెల్యేలుగా గెలిచినట్టేనని.. అప్పుడు బీసీ సీఎం అయ్యే చాన్స్ ఉంటుందన్నారు.
బీసీ కుల సంఘాల నేతలు బుధవారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంతా పార్టీల జెండాలను, ఎజెండాలను పక్కనపెట్టి బీసీ అభ్యర్థి నవీన్‌కు 130 బీసీ కుల సంఘాలు, 40 బీసీ సంఘాలు మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. బీసీ అభ్యర్థులను పెట్టాలని ప్రధాన పార్టీలను అడిగినా పెట్టలేదని.. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీసీ బిడ్డ నవీన్ యాదవ్ కు టికెట్ ఇచ్చిందన్నారు.
ఒక్కసారి బీసీలకు అవకాశం ఇవ్వండి
తమకు పార్టీలతో సంబంధం లేదని, బీసీలకు టికెట్ ఇస్తే ఏ పార్టీ అనేది చూడబోమన్నారు. గతంలో నాగర్జునసాగర్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ తరఫున, హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ తరఫున బీసీల కోసం ప్రచారం చేసి గెలిపించుకున్నామన్నారు. ఈ నియోజకవర్గంలో ఒకసారి రెడ్డీలకు, మూడుసార్లు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం ఇచ్చారని, ఒక్కసారి బీసీలకు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.
ఈ సమావేశంలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, బీసీ ఏ కులాల రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ ఏం బాగయ్య, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహ అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, ఎంబీసీ సంఘం అధ్యక్షుడు వీరస్వామి, సంచార జాతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోల శ్రీనివాస్, గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దిటి మల్లయ్య, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యాం కురుమ, వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షుడు పిట్ల శ్రీధర్, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొనగాని యాదగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
