ఇంగ్లాండ్ మాజీ విధ్వంసకర బ్యాటర్ జానీ బెయిర్ స్టో ఐపీఎల్ 2026 మినీ వేలంలో అన్ సోల్డ్ గా మిగిలిపోయిన సంగతి తెలిసిందే. ఫామ్ లేదనే కారణంగా ఈ ఇంగ్లాండ్ పవర్ హిట్టర్ ను ఏ ఫ్రాంచైజీ కూడా పట్టించుకోలేదు. 2025 ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్ తరపున ప్లే ఆఫ్ మ్యాచ్ లాడిన బెయిర్ స్టో అద్భుతంగా రాణించాడు. ఖచ్చితంగా వేలంలో అమ్ముడుపోతాడనుకున్నా నిరాశే మిగిలింది. అయితే బెయిర్ స్టో తనలో పదును తగ్గలేదని.. తాను ఇంకా ఫామ్ లో ఉన్నానని నిరూపించాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్ లో తన బ్యాటింగ్ తో విధ్వంసమే సృష్టించాడు.
సౌతాఫ్రికా టీ20 లీగ్ లో ప్రిటోరియా క్యాపిటల్స్, సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్ల మధ్య సోమవారం (జనవరి 5) మ్యాచ్ జరిగింది. సన్‌రైజర్స్ తరపున ఆడుతున్న బెయిర్ స్టో భారీ ఛేజింగ్ లో 45 బంతుల్లోనే 85 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బెయిర్ స్టో ఇన్నింగ్స్ లో 6 సిక్సులు, 8 ఫోర్లున్నాయి. ప్రిటోరియా క్యాపిటల్స్ స్పిన్నర్ మహారాజ్ వేసిన ఇన్నింగ్స్ 12 ఓవర్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ ఓవర్లో ఏకంగా 34 పరుగులు రాబట్టాడు. మొత్తం 5 సిక్సర్లు, ఒక ఫోర్ ఉన్నాయి. తొలి మూడు బంతులను సిక్సర్లుగా మలిచిన సన్‌రైజర్స్ ఓపెనర్ నాలుగో బంతికి ఫోర్ కొట్టాడు. చివరి రెండు బంతులను సిక్సర్లు కొట్టి ఊచకోత కోశాడు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే ప్రిటోరియా క్యాపిటల్స్ పై సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ప్రిటోరియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. కానర్ ఎస్టర్హుయిజెన్ హాఫ్ సెంచరీ చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ 22 బంతుల్లోనే 47 పరుగులు చేసి చివర్లో మెరుపులు మెరిపించాడు. 177 పరుగుల లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 14.2 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 177 పరుగులు చేసి సునాయాస విజయాన్ని అందుకుంది. బెయిర్ స్టో (85)తో పాటు క్వింటన్ డి కాక్ (79) హాఫ్ సెంచరీతో దుమ్ములేపాడు.
THE MOST EXPENSIVE OVER IN SA20 👀
— Cricbuzz (@cricbuzz) January 6, 2026
Keshav Maharaj was taken for 34 runs by Jonny Bairstow.#SA20 #PCvSEC pic.twitter.com/k6WUb1c621
