- ఆరు దశాబ్దాల పోరాటాన్ని తక్కువ చేసి మాట్లాడ్తవా?: కవిత
- రాష్ట్ర బీజేపీ ఎంపీలు తేజస్వితో క్షమాపణ చెప్పించాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: ఎంత ధైర్యం ఉంటే తెలంగాణ పోరాటాన్ని అవమానించేలా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడ్తారంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఆరు దశాబ్దాల ఆకాంక్ష అంటే అంత చులకనైందా అని గురువారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలను అవమానించేలా ఆయన వ్యాఖ్యలున్నాయన్నారు. ఆరు దశాబ్దాల పాటు ఎదుర్కొన్న వివక్షకు వ్యతిరేకంగా ఇక్కడి ప్రజలు చేసిన పోరాటాన్ని తక్కువ చేసి మాట్లాడ్తవా అంటూ ఫైర్ అయ్యారు.
తెలంగాణ ఉద్యమాన్నే కాకుండా రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులను కూడా తేజస్వి అవమానించారన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఎవరు మాట్లాడినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలా మాట్లాడిన తేజస్వి వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ ఎంపీలు ఖండించి, ఆయనతో క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు. కాగా, నియోజకవర్గాల పునర్విభజనలో తెలంగాణకు అన్యాయం చేసే కుట్ర జరుగుతోందని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం ప్రభుత్వం పార్లమెంట్‌లో తెలంగాణకు రాజకీయ ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. మహిళా బిల్లుకు, డీలిమిటేషన్ బిల్లుకు అసలు సంబంధం ఏంటని ప్రశ్నించారు.
మహిళా బిల్లును ఎప్పుడో ఆమోదించారని, డీలిమిటేషన్, మహిళా బిల్లు వేర్వేరు అంశాలని చెప్పారు. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డీలిమిటేషన్ అంశాన్ని కాల్చాలని ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తామంటే ఉరుకునేదే లేదని, మరో తెలంగాణ ఉద్యమం మాదిరిగా ఉద్యమాన్ని చేపడ్తామని హెచ్చరించారు. కాగా, గురువారం కవిత కాశీ పర్యటనకు వెళ్లారు. గంగా నదిలో పుణ్య స్నానాలు ఆచరించి కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నారు.

