V6 News

ఇంత అహంకార వ్యాఖ్యలా?.. రాష్ట్ర ఏర్పాటును పాక్ విభజనతో పోలుస్తరా? :కేటీఆర్

ఇంత అహంకార వ్యాఖ్యలా?.. రాష్ట్ర ఏర్పాటును పాక్ విభజనతో పోలుస్తరా? :కేటీఆర్
  • ఎవరి భిక్ష కాదు.. అమరుల త్యాగఫలం, ప్రజల ఆత్మగౌరవం 
  • బీజేపీ నేతలకు తెలంగాణను అవమానించడం అలవాటుగా మారిందని కామెంట్​ 

హైదరాబాద్​, వెలుగు:  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చడం అత్యంత మూర్ఖత్వమని, ఇది బీజేపీ అహంకారానికి పరాకాష్ట అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్​అయ్యారు. పార్లమెంటు సాక్షిగా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై  గురువారం ఒక ప్రకటనలో కేటీఆర్​ తీవ్రంగా ఖండించారు. తెలంగాణ అస్తిత్వంపై బీజేపీ నేతలకు ఏమాత్రం గౌరవం లేదని, పదేపదే రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని, అమరుల త్యాగాలను అవమానించడం ఆ పార్టీకి అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ ఎవరి దయాదాక్షిణ్యాలతోనో లేదా భిక్ష వల్లో ఏర్పడలేదు. దశాబ్దాల సుదీర్ఘ పోరాటం, వేలాది మంది యువకుల బలిదానాల ఫలితంగా ఈ గడ్డ విముక్తి పొందింది. అస్తిత్వం కోసం జరిగిన ప్రజాస్వామ్య పోరాటాన్ని దేశ విభజన లాంటి విషాదంతో పోల్చడం బీజేపీ కుసంస్కారాన్ని బయటపెడుతోంది" అని కేటీఆర్ విమర్శించారు. 

బీజేపీ, కాంగ్రెస్​ఎంపీలు ఏం చేస్తున్నరు? 

పార్లమెంటులో తెలంగాణను అవమానిస్తున్నా అక్కడే ఉన్న ఎనిమిది మంది బీజేపీ ఎంపీలతో పాటు, కాంగ్రెస్ ఎంపీలు కూడా మౌనంగా ఉండటం సిగ్గుచేటని కేటీఆర్​అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యమా అని ప్రశ్నించారు.తేజస్వి సూర్య తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  

‘సర్​’పై జాగ్రత్తగా ఉండండి: పార్టీ శ్రేణులకు పిలుపు

రాష్ట్రంలో జరగనున్న ఓటర్ల జాబితా స్పెషల్​ ఇంటెన్సివ్​ రివిజన్​ (ఎస్​ఐఆర్​)పై  బీజేపీ, కాంగ్రెస్​లు అక్రమాలకు పాల్పడకుండా బీఆర్​ఎస్​ శ్రేణులు జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్​ పిలుపునిచ్చారు. గురువారం పార్టీ నాయకులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌నిర్వహించి దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ తరఫున త్వరలోనే ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.