
- 16,620 మంది విద్యార్థులతో లిస్టు రిలీజ్ చేసిన కాళోజీ హెల్త్ వర్సిటీ
- సుప్రీం తీర్పుతో 1,020 మంది నాన్ లోకల్స్ గా గుర్తింపు
- రేపు సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాల స్వీకరణ
హైదరాబాద్, వెలుగు: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం కన్వీనర్ కోటా ప్రొవిజనల్ మెరిట్ లిస్టును కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ శుక్రవారం విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మొత్తం 16,620 మంది విద్యార్థులతో కూడిన ప్రొవిజనల్ మెరిట్ లిస్టును వర్సిటీ రిలీజ్ చేసింది. ఈ నెల 14 సాయంత్రం 5 గంటల వరకు ఈ లిస్టుపై అభ్యంతరాల స్వీకరిస్తామని, విద్యార్థులు తమ అభ్యంతరాలను knrugadmission@gmail.com కు మెయిల్ చేయాలని వర్సిటీ సూచించింది.
ఆ తరువాత వచ్చిన అభ్యంతరాలను స్వీకరించబోమని స్పష్టంచేసింది. ఈ నెల 15న ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేసి, 16 నుంచి మొదటి విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. 17 నుంచి 19 వరకు వెబ్ ఆప్షన్ల ఎంపికకు అవకాశం ఇచ్చారు. 20 నుంచి 24 వరకు విద్యార్థులు కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. రెండు, మూడు రౌండ్ల కౌన్సెలింగ్ ప్రక్రియను ఈ నెల 30 నాటికి పూర్తి చేయనున్నారు.
సుప్రీంకోర్టు తీర్పుతో 1,020 మంది అనర్హుల గుర్తింపు
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు స్థానికతకు సంబంధించి సుప్రీం కోర్టు ఈ నెల 1న రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. 9వ తగరతి నుంచి వరుసగా నాలుగేండ్లు తెలంగాణలో చదివిన విద్యార్థులను స్థానికులుగా పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్దించింది. నాలుగు కేటగిరీలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు చెందిన విద్యార్థులకు స్థానికతకు సంబంధించి కొన్ని మినహాయింపులు ఇచ్చింది. సుప్రీం సూచనలు పాటిస్తూ... మొత్తం1020 మంది విద్యార్థులను నాన్ లోకల్స్ గా కాళోజీ వర్సిటీ గుర్తించింది. ఈ 1020 మంది విద్యార్థులు స్థానికతకు సంబంధించి సరైన సర్టిఫికేట్లను సమర్పించలేదు. దీంతో వారిని అనర్హులుగా వర్సిటీ పేర్కొంది.