- మూడు నెలల్లో ఇచ్చిన బిల్డింగ్ పర్మిషన్లు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లపై విచారణ
- నార్సింగి, నిజాంపేట్, బండ్లగూడ జాగీర్,
- మణికొండలో అక్రమాలు..ఇల్లీగల్ భవనాలకూ ఓసీలు
- చర్యలకు రంగం సిద్ధం
హైదరాబాద్ సిటీ, వెలుగు : జీహెచ్ఎంసీలో ఇటీవల విలీనమైన లోకల్ బాడీల్లో అధికారులు ఇచ్చిన పర్మిషన్లపై జీహెచ్ఎంసీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ఫోకస్ పెట్టింది. 27 లోకల్ బాడీలు జీహెచ్ఎంసీలో విలీనానికి ముందు స్థానిక అధికారులు పలు అక్రమాలకు పాల్పడినట్లు అనుమానం రావడంతో కమిషనర్ విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు తెలిసింది.
దీంతో గత మూడు నెలల్లో లోకల్ బాడీల్లో ఇచ్చిన బిల్డింగ్ పర్మిషన్లు, అక్యుపెన్సీ సర్టిఫికెట్ల(ఓసీ) జారీపై విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తోంది. కొన్ని చోట్ల అధికారులు ఇష్టానుసారంగా నిర్మాణ అనుమతులతో పాటు ఓసీలు జారీ చేసినట్లు గుర్తించారు. విలీనమవుతున్నాయని హడావుడిగా పర్మిషన్లు ఇచ్చారని, అలాగే పలు అక్రమ నిర్మాణాలకు సైతం పర్మిషన్స్ ఇవ్వడంతో పాటు పెండింగ్ లో ఉన్న ఫైల్స్ క్లియర్ చేసినట్లు తెలిసింది. నిర్మాణంలో ఉన్న బిల్డింగులతో పాటు ఇల్లీగల్ భవనాలకు ఓసీలు ఇచ్చినట్లు తెలుసుకున్నారు.
అక్రమంగా ఇంటి నెంబర్లు జారీ చేయడంతో పాటు నచ్చిన వారికి పెండింగ్ బిల్లులు చెల్లించినట్లు గుర్తించారు. విలీనం తర్వాత కొత్త నిబంధనలు రాకముందే జాగ్రత్త పడ్డారని, ఎక్కువగా నార్సింగి, నిజాంపేట్, బండ్లగూడ జాగీర్, మణికొండల్లో ఈ పరిస్థితి ఉందని అధికారుల దృష్టికి వచ్చింది. పూర్తి విచారణ అనంతరం కమిషనర్ కు రిపోర్ట్ అందజేయనున్నారు.
జారీ చేసిన అనుమతుల రద్దు?
మూడు నెలల ఫైల్స్ ను పరిశీలించిన తర్వాత పేపర్ పై ఉన్న ప్లాన్ కు, అక్కడ కట్టిన భవనానికి పొంతన ఉందో లేదో విజిలెన్స్చెక్చేయనున్నది. అనుమతులు ఇచ్చిన తేదీలు, ఆ టైంలో ఆన్ లైన్ సిస్టమ్ లో జరిగిన మార్పులపై ఆరా తీయనున్నది. విజిలెన్స్ విచారణలో అక్రమాలు జరిగాయని రుజువైతే, ఆ పర్మిషన్లను రద్దు చేయడమే కాకుండా, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది.
