ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు జిల్లా అంకిరెడ్డి పాలెం దగ్గర ఆగి ఉన్న కారును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. మృతులను తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
