- టీ20 వరల్డ్ కప్స్‌లో వరుసగా పదో విజయం..
- 93 రన్స్ తేడాతో నమీబియాపై గెలుపు
- ఇషాన్, పాండ్యా మెరుపులు
న్యూఢిల్లీ: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. టోర్నీ చరిత్రలో వరుసగా పదో విజయంతో మెరిసి మురిసింది. బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్ (24 బాల్స్‌లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 61), హార్దిక్ పాండ్యా (28 బాల్స్‌లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52) మెరుపులకు తోడు బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి (3/7) చెలరేగడంతో గురువారం జరిగిన గ్రూప్–ఎ లీగ్ మ్యాచ్‌లో ఇండియా 93 రన్స్ తేడాతో నమీబియాపై నెగ్గింది. టాస్ ఓడిన ఇండియా 20 ఓవర్లలో 209/9 స్కోరు చేసింది. తర్వాత నమీబియా 18.2 ఓవర్లలో 116 రన్స్‌కే ఆలౌటైంది. లారెన్ స్టీన్‌క్యాంప్ (29) టాప్ స్కోరర్. పాండ్యాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
స్పిన్నర్ల జోరు..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇండియా ఆరంభంలో పరుగుల వరర పారిస్తే.. మధ్యలో నమీబియా స్పిన్నర్లు వికెట్లు తీసి స్కోరును కట్టడి చేశారు. దాంతో 300 స్కోరు చేస్తారనుకుంటే పడుతూ లేస్తూ రెండొందలు దాటింది. ఇన్నింగ్స్ ఆరో బాల్‌నే సిక్స్‌గా మలిచిన శాంసన్ (22) తర్వాతి ఓవర్‌లో 6, 6, 4తో రెచ్చిపోయినా లాస్ట్ బాల్‌కు వెనుదిరిగాడు. తొలి వికెట్‌కు 25 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. అవతలి వైపు నాలుగు ఫోర్లతో ఇషాన్ దూకుడు చూపెట్టగా, తిలక్ వర్మ (25) కూడా రెండు బౌండ్రీలు బాదాడు. ఆరో ఓవర్‌లో ఇషాన్ 6, 6, 6, 6, 4తో 28 రన్స్ దంచాడు. ఈ క్రమంలో 20 బాల్స్‌లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. ఇక 7వ ఓవర్‌లో తిలక్ 4 కొడితే, క్యాచ్ ఔట్ నుంచి బయటపడిన ఇషాన్ 6, 4 దంచాడు. దాంతో 18 రన్స్ వచ్చాయి. తర్వాతి ఓవర్ తొలి బాల్‌కు భారీ షాట్‌కు యత్నించిన ఇషాన్ డీప్ మిడ్ వికెట్‌లో షికోంగోకు చిక్కాడు. ఫలితంగా రెండో వికెట్‌కు 79 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. ఈ దశలో వచ్చిన సూర్యకుమార్ (12) సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేశాడు. 9వ ఓవర్‌లో 5 రన్సే వచ్చినా 10వ ఓవర్‌లో సూర్య సిక్స్‌తో స్కోరు 120/2కు చేరింది. ఇక్కడి నుంచి నమీబియా స్పిన్నర్లు పట్టు బిగించారు. బెర్నార్డ్ స్కూల్జ్ (1/41) వేసిన11వ ఓవర్ తొలి బాల్‌కే సూర్య స్టంపౌట్ అయ్యాడు. మూడో వికెట్‌కు 16 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. 9 బాల్స్ తర్వాత ఎరాస్మస్ (4/20) బౌలింగ్‌లో తిలక్ కొట్టిన భారీ షాట్‌ను లాంగాఫ్‌లో స్మిత్ సూపర్ రన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. దాంతో ఇండియా స్కోరు 124/4గా మారింది. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే (23) ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. 6, 4తో గాడిలో పడిన పాండ్యా 15వ ఓవర్‌లో రిపీట్ చేశాడు. మధ్యలో దూబే సిక్స్‌తో టచ్‌లోకి వచ్చాడు. 16వ ఓవర్‌లో పాండ్యా 6, 4, 4తో 16 రన్స్ రాగా... మధ్యలో సింగిల్స్‌తో స్కోరును ముందుకు తీసుకెళ్లారు. 18వ ఓవర్‌లో సిక్స్‌తో 27 బాల్స్‌లో పాండ్యా ఫిఫ్టీ పూర్తి చేసినా ఇండియాకు ట్రిపుల్ స్ట్రోక్ తగిలింది. నాలుగు బాల్స్ తేడాలో పాండ్యా, దూబే, అక్షర్ పటేల్ (0) ఔటయ్యారు. ఐదో వికెట్‌కు 81 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. లాస్ట్ ఓవర్‌లో రింకూ సింగ్ (1), అర్ష్‌దీప్ (2) ఔట్ కావడంతో మూడు రన్సే వచ్చాయి.
బౌలర్లు అదుర్స్..
ఛేజింగ్‌లో నమీబియా టాప్ ఆర్డర్ కొద్దిగా పోరాడినా.. ఇండియా బౌలింగ్ దెబ్బకు మిడిల్, లోయర్ ఆర్డర్ ఫెయిలైంది. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి టర్నింగ్ బాల్స్‌ను అర్థం చేసుకోలేక పెవిలియన్‌కు క్యూ కట్టారు. నాలుగో ఓవర్‌లో అర్ష్‌దీప్ (1/36).. జాన్ ఫ్రైలింక్ (22)ను ఔట్ చేయడంతో తొలి వికెట్‌కు 33 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. స్టీన్ క్యాంప్, జాన్ నికోల్ (13) మెల్లగా ఆడటంతో పవర్‌ప్లేలో నమీబియా 58/1 స్కోరు చేసింది. ఇక్కడి నుంచి వరుణ్ స్పిన్‌కు మిగతా బ్యాట ర్లు బ్యాట్లెత్తేశారు. 8వ ఓవర్‌లో స్టీన్‌క్యాంప్‌ను ఔట్ చేసిన వరుణ్.. 10వ ఓవర్‌లో డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. మూడు బాల్స్ తేడాలో జాన్ నికోల్, జేజే స్మిత్ (0)ను పెవిలియన్‌కు పంపాడు. దాంతో 10 ఓవర్లలో స్కోరు 88/4గా మారింది. 11, 13వ ఓవర్‌లో అక్షర్ పటేల్ (2/20).. గెరార్డ్ ఎరాస్మస్ (18), మలాన్ క్రుగెర్ (5) వికెట్లు తీయడంతో నమీబియా 94/6తో ఎదురీత మొదలుపెట్టింది. జానే గ్రీన్ (11)తో జతకలిసిన రూబెన్ ఆడే ప్రయత్నం చేసినా సక్సెస్ కాలేదు. 17వ ఓవర్‌లో బుమ్రా (1/20) రూబెన్‌ను వెనక్కి పంపగా, 18వ ఓవర్‌లో వరుస బాల్స్‌లో పాండ్యా.. బెర్నార్డ్ (4), షికోంగో (0)ను ఔట్ చేశాడు. ఆ వెంటనే దూబే.. గ్రీన్ వికెట్ తీయడంతో నమీబియాకు భారీ ఓటమి తప్పలేదు.
సంక్షిప్త స్కోర్లు
- ఇండియా: 20 ఓవర్లలో 209/9 (ఇషాన్ 61, పాండ్యా 52, ఎరాస్మస్ 4/20). నమీబియా: 18.2 ఓవర్లలో 116 ఆలౌట్ (స్టీన్‌క్యాంప్ 29, ఫ్రైలింక్ 22, వరుణ్ 3/7).
- మెగా టోర్నీలో రన్స్ పరంగా ఇండియా ఇదే అతి పెద్ద విజయం (93 రన్స్).
- మెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో ఇండియాకు వరుసగా పదో విజయం (2024–26). సౌతాఫ్రికా (8, 2024), ఆస్ట్రేలియా (8, 2022–24) తర్వాతి ప్లేస్‌ల్లో ఉన్నాయి.
- 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత ఇండియా 200లకు పైగా స్కోరు చేసింది.
